ఉక్రెయిన్ నుంచి ఇప్పుడిప్పుడే రష్యా సేనలు వెనుదిరుగుతున్నాయి. ఈ యుద్ధం పూర్తిగా ముగియకముందే రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ మరో వార్ కు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ది మిర్రర్ పత్రికా కథనం ప్రకారం.. రష్యా గూఢచారుల భారీ నెట్‌వర్క్ బ్రిటన్‌లో విస్తరించినట్లు ఇంటెలిజెన్స్ సంస్థల విశ్లేషణలో తేలినట్లు సమాచారం. దాదాపు 1,000 మందికిపైగా గూఢచారులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్నట్లు అంచనాకు వచ్చింది. వీరిని రష్యాకు చెందిన ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ నియంత్రిస్తోంది.
ప్రస్తుతం యూకేలో 73 వేల మంది రష్యా నిపుణులు పనిచేస్తున్నారు. వీరిలో కూడా కొందరు క్రెమ్లిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. శుక్రవారం బెర్లిన్‌లోని బ్రిటన్ రాయబార కార్యలయ సెక్యూరిటీ గార్డ్ ఒకరు మాస్కోకు సమాచారం పంపుతుండగా పట్టుకున్నారు.
మినీక్యాబ్ డ్రైవర్ల నుంచి బారిస్టర్లలో కూడా ఈ వేగులు ఉన్నట్లు గుర్తించారు. లోతైన గూఢచారుల నెట్‌వర్క్‌ను రష్యా సృష్టించిందని.. వీరంతా సాధారణ పౌరుల్లానే జీవిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా విద్యార్థులు, ట్రేడ్ యూనియన్లు, ఉద్యమ సంస్థలు, టీచర్లు, డ్రైవర్లు, రాజకీయ నాయకులు, సివిల్ సర్వీస్ సిబ్బంది, పోలీసులు.. ఇలా ప్రతి విభాగంలో ఉన్నట్లు గుర్తించారు. లండన్‌లోని రష్యా రాయబారా కార్యాలయ పరిధిలో పనిచేసే గూఢచారల సంఖ్య తగ్గి.. అజ్ఞాతంగా పనిచేసేవారి సంఖ్య పెరిగినట్లు సదరు నివేదిక వెల్లడించింది.