జైలుకు వెళ్లొద్దని పన్నాగం.. కూలీని హత్య చేసి ముఖం కాల్చి..

-

13 ఏండ్ల కూతురు హత్య కేసులో జైలుకు వెళ్లాడు. పేరోల్‌పై బయటకు వచ్చాడు. మళ్లీ జైలుకు వెళ్లొద్దని భార్యతో కలిసి పెద్ద కుట్రకు తెర తీశాడు. అమాయకుడిని హత్య చేశాడు. చనిపోయింది తానేనని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు చాకచక్యంగా హత్య కేసును ఛేదించారు. ఈ దారుణమైన కుట్రలో సుదేశ్ భార్య అతనితో కుమ్మక్కయ్యిందని పోలీసులు తెలిపారు. భార్యభర్తలిద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

నవంబర్ 20న గజియాబాద్‌లోని లోని ప్రాంతంలో మోహం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శరీరంపై ఉన్న దుస్తుల్లో వెతకగా సుదేశ్ ఆధార్ కార్డ్ దొరికింది. సంఘటన స్థలానికి అతడి భార్యను పిలిపించగా సుదేశ్ మృతదేహంగా గుర్తించింది.

అయితే, ఆ తర్వాత సుదేశ్ బతికే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. భార్యభర్తలు నివసించే ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. సుదేశ్‌ను పోలి ఉన్న ఒక వ్యక్తి సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకుపోతున్నట్లు పోలీసులు గుర్తించారు.

తన భార్యను కలవడానికి సుదేశ్ ఇంటికి వచ్చాడని పోలీసులకు ఉప్పందంది. ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుదేశ్‌ను పోలీసులు ప్రశ్నించగా తన 13 ఏండ్ల కూతురు హత్య కేసులో 2018లో జైలుకు వెళ్లినట్లు తెలిపారు. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో పేరోల్‌పై విడుదలైనట్లు పోలీసులకు వివరించాడు. అతి త్వరలో పేరోల్ సమయం ముగిసిపోతుందని సుదేశ్ ఆందోళనకు గురయ్యాడు. హత్య కేసులో శిక్ష పడుతుందని భయందోళనకు గురయ్యాడు.

జైలును తప్పించుకోవడం కోసం సుదేశ్ కుట్రకు తెర తీశాడు. మరో వ్యక్తిని హత్య చేసి, తానే మృతిచెందినట్లు సృష్టించాడని పోలీసులు తెలిపారు.

హత్య ప్రణాళిక అమలుకు పూనుకున్నాడు సుదేశ్. తన ఇంట్లో రిపేర్ వర్క్ ఉందని ఓ కూలీని ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత కూలీతో మద్యం తాగించాడు. కట్టె మంచం కాలుతో అతడి తలపై బాది హత్య చేశాడు.

ఎవరూ గుర్తించకుండా ఉండటం కోసం మృతదేహం ముఖాన్ని సుదేశ్ దహనం చేశాడు. అనంతరం బయటకు తీసుకెళ్లి పడేశాడు.

పోలీసుల దర్యాప్తులో కూలీ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తేలింది. మృతదేహాన్ని కూలీ కుటుంబ సభ్యులు గుర్తించారు.

గజియాబాద్ రూరల్ ఎ్సపీ ఇరాజ్ రాజా మాట్లాడుతూ భార్యభర్తలు పెద్ద కుట్రకు తెరతీశారని తెలిపారు. కానీ, హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారని అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news