పశ్చిమబెంగాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉలుబెరియా నగరంలోని మున్సిపాలిటీ చెత్త కుండీలో 17 గర్భ పిండాలు బయటపడ్డాయి. దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర కలకలం రేపింది. ఈ 17 పిండాల్లో 10 ఆడపిల్లలు, ఆరు మగపిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఉలుబెరియా పట్టణ ప్రాంతానికి కిలో మీటర్ పరిధిలో 30 ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి.
అయితే ఈ పిండాలను నర్సింగ్ హోమ్‌ల వైద్య వ్యర్థాలుగా ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పిండాలను పోస్టుమార్టం కోసం ఉల్బారియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇలాంటి ఘటనే జూన్ 25న కర్ణాటకలో చోటు చేసుకుంది. బెలగావి జిల్లాలోని మూడలగి గ్రామ శివారులో ఒక బాక్సులో ఏడు అబార్షన్ చేసిన పిండాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.