టెన్త్ పేపర్లు లీక్..కేసీఆర్‌ సర్కారుకు చిక్కులు..బండి-రేవంత్ తగ్గట్లేదు!

-

తెలంగాణలో పరీక్షా పత్రాల లీక్ ఆగడం లేదు. మొన్నటివరకు టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్లు లీక్ అయినవి అనుకుంటే..ఇప్పుడు ఏకంగా టెన్త్ ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ల లీక్ పై ప్రతిపక్షాలు..కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు టెన్త్ పేపర్లు కూడా లీక్ కావడంతో ప్రతిపక్షాలు ఏ మాత్రం తగ్గడం లేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పాలనను గాలికొదిలి.. రాజకీయ విధ్వంసంలో మునిగారని, పాలన పట్టించుకోక పోవటం వల్లే ప్రశ్నపత్రాల లీకులు జరుగుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. ఎస్‌ఎస్‌సీ మొదలు టీఎస్‌పీఎస్‌సీ వరకు కుప్పకూలాయని, లక్షల మంది విద్యార్థులతో సీఎం చెలగాటం ఆడుతున్నారని, ఇక పరీక్షలు కాదు… రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకుల జాతర నడుస్తుందని, వరుస లీకులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, లీకులకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పరీక్షలు నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో విద్యార్థిగా, ఉద్యోగార్ధిగా బతకడమంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని, రాష్ట్ర పాలకుల బాధ్యతారాహిత్యం వల్ల మొన్నటికి మొన్న ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్షలు పెట్టే టీఎస్‌పీఎస్‌సి) ప్రశ్నాపత్రాలు లీకవగా… ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం, ఇప్పుడు హిందీ పేపర్ లీకయ్యాయని  బి‌జే‌పి నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలంటే ప్రభుత్వానికి ఒక ఆటగా మారిపోయిందని మండిపడ్డారు. మొత్తానికి పేపర్ల లీకులు కే‌సి‌ఆర్ సర్కారుకు పెద్ద చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం ఎలా ఎదురుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news