నోటి పూత (Mouth Ulcers) సమస్య అనేది అప్పుడప్పుడు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. పెదవుల లోపలి వైపు, చిగుళ్ల మీద పుండ్లలా ఏర్పడుతుంటాయి. దీంతో తినడం, తాగడం ఇబ్బంది అవుతుంది. నొప్పి, మంట కలుగుతాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి.
1. యాపిల్ సైడర్ వెనిగర్ నోటి పూతను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అర కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసి పుక్కిలించాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే నోటి పూత తగ్గుతుంది.
2. బాక్టీరియాను చంపడంలో లవంగాలు బాగా పనిచేస్తాయి. అందువల్ల పూటకు ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకుని నములుతూ రసం పీలుస్తుండాలి. నోట్లో పుళ్లు, పూత తగ్గుతాయి.
3. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల సహజసిద్ధమైన ఆయింట్‌మెంట్‌లా పనిచేస్తుంది. నోట్లో పూత ఉన్న చోట కొద్దిగా తేనెను రాయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది.
4. కలబంద గుజ్జును నోట్లో పూత ఉన్న చోట రాస్తుండాలి. నోటి పూత నుంచి బయట పడవచ్చు.
5. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిపూతను తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటిని ఒక కప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసి పుక్కిలించాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.
6. నోటిపూతను తగ్గించడంలో నెయ్యి కూడా బాగానే పనిచేస్తుంది. నోట్లో పూత ఉన్న చోట నెయ్యి రాస్తుండాలి. సమస్య తగ్గుతుంది.