ఎడతెరిపి లేకుండా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర లో జలవిలయం తరహా పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని సామాన్య జనజీవనం కుంటుపడగా, వరదల బారిన పడి ఈ సీజన్‌లో ఇంతవరకూ 72 మంది మృత్యువాత పడ్డారు. అధికారిక గణాంకాల ప్రకారం, జూన్ 1వ తేదీ నుంచి ఇంతవరకూ కనీసం తొమ్మిది మంది జాడ గల్లంతు కాగా, 93 మంది వరకూ గాయపడ్డారు.
థానే, పాల్ఘర్, రాయ్‌ఘడ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీలలో కుండపోత వర్షాలను ఎదుర్కోవడానికి NDRF బృందాలు ఇప్పటికే మోహరించగా.. అంతకుముందు జూలై 19న మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి కుగ్రామంలో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖలాపూర్ తహసీల్ పరిధిలోని కొండ వాలుపై ఉన్న గిరిజన గ్రామం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. 86 మంది గ్రామస్తుల జాడ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.