మధ్యప్రదేశ్ లో అమానవీయకర సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్ లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో జన్మనిచ్చిన బిడ్డని పోషించలేక ఓ మైనర్ తల్లి తన రెండు నెలల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. చిన్న పాపను గొంతునులిమి అతి దారుణంగా హతమార్చింది. కాసేపటికి స్థానికులు జరిగిన దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ లోని ఖజ్రానా ప్రాంతంలో నివసిస్తున్న మైనర్ బాలికపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ క్రమంలో ఆ యువకుడిని బాధితురాలి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ బిడ్డకు అన్యాయం చేయకూడదని ప్రాధేయపడ్డారు. దీంతో ఆ యువకుడు కనపడకుండా పారిపోయాడు. ఈ క్రమంలో నెలలు నిండడం తో ఆ మైనర్ బాలిక ప్రసవించింది. ఓ బిడ్డకు తల్లి అయ్యింది. కానీ మైనర్ తల్లి తన రెండు నెలల బిడ్డను సరిగ్గా పోషించలేక పోయింది. దీంతో ఆ బాలిక తన రెండు నెలల పసికందు పట్ల అమానుషంగా ప్రవర్తించింది. చిన్న పాపను గొంతునులిమి అతి దారుణంగా హతమార్చింది.
అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని చూసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితురాలిగా ఉన్న మైనర్ తల్లిని పోలీసులు విచారించగా తన బిడ్డను తనే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనలో మరి ఎవరి ప్రమేయం లేదని సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.