హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన జరుగుతున్న ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్నింగ్ పాయింట్ వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేసర్‌కు స్వల్పగాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది రేసర్‌ను తీసుకెళ్లి.. కారును క్రేన్ సాయంతో బయటికి తీశారు. దీంతో నిర్వాహకులు రేసును కొద్దిసేపు నిలిపివేశారు. ఆ తర్వాత యథావిధిగా ప్రాక్టీస్ రేస్ జరిగింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు వాహనదారులు దూసుకొచ్చారు. దీంతో ప్రాక్టీస్ రేస్ నిర్వాహణలో ఆలస్యం అయింది.
ట్రాక్ మీదకు స్థానికులు వాహనాలు ఎలా వచ్చాయని రేసింగ్ నిర్వాహకులు ఆందోళన పడుతున్నారు. ట్రాక్ పైకి వాహనాలు అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలు చేపట్టారు అధికారులు. కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రాక్టీస్ రేస్ వల్ల వాహనాలను దారిమళ్లించారు పోలీసులు. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను తోసుకుని ట్రాక్ పైకి వచ్చారని తెలుస్తోంది.