ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది. కంపెనీలో విషవాయులు ఎలా వచ్చాయి.. బ్రాండిక్స్ లో పని చేస్తున్న కార్మికులకు ఎలా సోకిందనే విషయంపై రకరకాల సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే బ్రాండిక్స్ కంపెనీ తమ ఫ్యాక్టరీలో కెమికల్స్ వాడటం లేదని, గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని పేర్కొంది. గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రభుత్వం వేసిన కమిటీనే చెప్పాలంటూ బ్రాండిక్స్ సీఈఓ తెలిపారు.
విషవాయువు పీల్చి 200 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు వాళ్లందరి ఆరోగ్య బాధ్యతలు సంస్థనే భరిస్తుందని బ్రాండిక్స్ సీఈఓ తెలిపారు. వాస్తవానికి ఘటన సమయంలో సంస్థ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు. కాగా, ఈ ఘటనపై ఏర్పాటైన కమిటీ వాస్తవాలు తెలుసుకోవడానికి విచారణ కొనసాగిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు గ్యాస్ లీకేజీ ఘటన సంభవించింది. ప్రమాదకరమైన విషవాయులు గాలిలో కలవడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. ప్రాణభయంతో సంస్థ ఉద్యోగులు తలుపులు పగలగొట్టుకుని పరుగులు తీశారు.