టర్కీ, సిరియా భూకంపం సృష్టించిన విలయం నుంచి బయట పడకముందే పలు దేశాల్లో ఇటీవల భూకంపం మరోసారి విధ్వంసం సృష్టిస్తోంది. టర్కీ భూకంపం తర్వాత పరిశోధకులు మరికొన్ని దేశాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించే అవకాశముందని చెప్పిన విషయం తెలిసిందే. వారు చెప్పినట్లే పలు దేశాల్లో భూకంపం వస్తోంది.
తాజాగా అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఫైజాబాద్‌కు 267 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
రెండు రోజుల క్రితం ఫైజాబాద్‌లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 4.05 నిమిషాలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఉదయం 5.30 గంటలకు తజికిస్థాన్‌లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దీనితీవ్రత 4.3గా నమోదయిందిన ఎన్‌సీఎస్ వెల్లడించింది.