ఓ విధంగా చూసుకుంటే టీడీపీకి, టీఆర్ఎస్ కి మంచి పోలికలు ఉన్నాయి. ఆ విధంగా ఆ రోజు కాంగ్రెస్ కు దీటుగా టీఆర్ఎస్ ఎదిగింది. అంతకు మునుపు కాలంలో కలిసి వచ్చిన రోజు ఒకటి ఉంటే అప్పుడు కాంగ్రెస్ ను ఎదిరించి టీడీపీ ఎదిగింది. ఓ విధంగా చంద్రశేఖర్ రావుకు నాయకత్వ లక్షణం అన్నది టీడీపీ నుంచి వచ్చింది. చంద్రబాబుకు కూడా నాయకత్వ పటిమ అన్నది కాంగ్రెస్ నుంచి కాదు టీడీపీ నుంచే వచ్చింది. కనుక కొన్ని విషయాల్లో టీడీపీని పెద్దగా తిట్టిపోయడం వల్ల లాభం లేదని కేసీఆర్ ఒప్పుకోవాలి. లేదా ఇప్పటికే కేటీఆర్ ఒప్పుకున్న విషయాన్ని మనం మరోసారి మననం చేసుకుని తీరాలి. ఆ రోజు తాను చేసిన ఆలోచన కు విజన్ కు ఇప్పుడు ఫలితం వస్తున్నది అన్నది బాబు మాట. నిజమే !
ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో తిరుగులేని అభివృద్ధి మంచో చెడో హైద్రాబాద్ కే దక్కింది. ఆ విధంగా కేసీఆర్ ఆ ఫలాలు తాజాగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడాన్ని కూడా కాదనలేం. అందుకే చంద్రబాబు కూడా కొన్ని విషయాల్లో నిన్న కేసీఆర్ ను పొగిడారు. అదే సందర్భంలో జగన్ ను విమర్శించారు. తాను చేసిన అభివృద్ధికి కొనసాగింపును తన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు చేశారని చెప్పడం నిజంగానే శుభ పరిణామం. కానీ తాను చేసిన అభివృద్ధిని ఆంధ్రాలో కొనసాగింపు ఇవ్వకపోవడమే దురదృష్టకరమన్నది చంద్రబాబు స్పష్టం చేసిన అభిప్రాయం.
తెలంగాణలో టీడీపీ అన్నది లేదు.. ఈ విధంగా అనుకునేందుకు లేదు. ఎందుకంటే త్వరలో టీడీపీ జెండాలు వాడవాడలా మళ్లీ రెపరెపలాడనున్నాయి. ఆ విధంగా పునరుత్థాన ప్రక్రియకు చంద్రబాబు తెర లేపారు. పడి లేచిన కెరటం మాదిరిగా సడి చేయనుంది. తనదైన పోరాట స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా పనిచేయాలని టీడీపీ బాస్ కొన్ని మాటలు చెప్పారు. దీంతో క్యాడర్ లో నిరాశలు పోయి కొత్త ఉత్సాహం వచ్చే విధంగా ఉంది.
అంతేకాదు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ అన్నది ఈ నెల 25 నుంచి చేయాలని చెప్పారు. అంటే అప్పటి నుంచి ఇక ఆగని వేగంతో పార్టీ పని చేయాలన్నది చంద్రబాబు మనసులో మాట. వంద రూపాయలు కడితే చాలు సభ్యత్వం వస్తుందని, అదేవిధంగా కష్ట కాలంలో రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం కూడా వర్తింపజేస్తామని చంద్రబాబు చెప్పడం గమనార్హం.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా కాలానికి తెలంగాణ పరిణామాలపై ఫోకస్ పెట్టడమే కాదు అందుకు తగ్గ కార్యాచరణ కూడా ఏంటన్నది నిన్నటి వేళ ముఖ్య నాయకులకు చెప్పి వచ్చారు. ఆ విధంగా దిశా నిర్దేశం చేసి వచ్చారు. హైద్రాబాద్ ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ నేతలతో భేటీ కావడం చర్చకు తావిస్తోంది. ముఖ్యంగా చాలా కాలంగా ఇటు వైపు కన్నెత్తి కూడా చూసేందుకు ఇష్టపడని చంద్రబాబు తాజాగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీ ఎదగాలని చెప్పడమే ఆశ్చర్యకరం.