కొత్త సవాల్: సంక్రాంతి తర్వాత “మామూలుగా ఉండదు” అంటున్న బాబు!

-

కరోనాకు జనం అలవాటు పడిపోయారో లేదో తెలియదు కానీ.. చంద్రబాబు మాత్రం ఇంకా ఆ భయం లోనే ఉన్నారు! అయితే ఆ భయం మరికొన్ని రోజులే సుమా! ఎందుకంటే… 2020ని కరోనా నామ సంవత్సరం గడిపేసిన చంద్రబాబు.. 2021 సంక్రాంతి తర్వాత “మామూలుగా ఉండదు” అని జగన్ కు హెచ్చరికలు జారీచేస్తున్నారు!

అవును… సంక్రాంతిలోపు తాను చెప్పిన పని చేశారా సరి.. లేదంటే సంక్రాంతి తర్వాత ఉధ్యమాలు, ధర్నాలు మామూలుగా ఉండవు అని అంటున్నారు చంద్రబాబు. అందుకు జగన్ కు పెట్టిన కండిషన్.. “మా హయాంలో 6 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మించాం. వాటిని సంక్రాంతిలోగా లబ్ధిదారులకు కేటాయించకపోతే” అని అంటున్నారు చంద్రబాబు!

అవునా… నిజంగా చంద్రబాబు హయాంలో ఆరులక్షల ఇళ్లు కట్టారా అనుకునేలోపు… వైకాపా నుంచి రెస్పాన్స్ వచ్చేసింది. నిజంగా అన్ని లక్షల ఇళ్లు కట్టారా లేదా అన్నసంగతి కాసేపు పక్కనపెడితే… పూర్తిగా నిర్మాణం పూర్తైపోయిన ఇళ్లను చూపిస్తే, వెంటనే వాటిని లబ్ధిదారులకు అందిస్తామంటూ వైకాపా సవాల్ విసిరింది. అయితే ఈ సవాల్ స్వీకరించే దమ్ము టీడీపీ నేతలకు లేకుండా పోయింది!

ఎందుకంటే.. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో అపార్ట్ మెంట్లు పైకి అందమైన రంగుల్లో కనిపిస్తున్నా.. లోపల నిర్మాణ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి! ఆ విషయం బాబు & కోలకు తెలియంది కాదు! కాకపోతె కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలుపెడదామని బాబు ప్లాన్ చేశారంతే! ఎందుకంటే… కేంద్రం 7లక్షల ఇళ్లు మంజూరు చేస్తే, అందులో 3లక్షల ఇళ్లకు కేవలం పునాది మాత్రమే పడింది. 2.5 లక్షల ఇళ్లు కేవలం బేస్ మెంట్ వరకు వచ్చి ఆగిపోయాయి.

ఈ పరిస్థితులు తెలిసి కూడా జనాలను రెచ్చగొట్టాలనో, వైకాపా నేతలను రెచ్చగొట్టాలనో లేక తాను రెచ్చిపోబోతున్నాను అని చెప్పాలనో తెలియదు కానీ… బాబు అలా పలికారు! ఫలితంగా… సంక్రాంతి తర్వాత “మామూలుగా ఉండదు” అని తమ్ముళ్లు అంటుంటే… “ఏం ఉండదు” అని వైకాపా నేతలు చెబుతున్నారు! చూడాలి మరి.. సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో!

Read more RELATED
Recommended to you

Latest news