కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరుగుతోంది. భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 75 మంది పార్టీ ప్రతినిధులు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కర్ణాటకలోని బళ్లారిలో ఓటు వేయనున్నారు.