కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మంది బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోమైకోసిస్ వ్యాధి వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రబలంగా ఉన్న బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోమైకోసిస్ వ్యాప్తిని నివారించడంలో ముఖ్యమైన మూడు అంశాలను ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా శుక్రవారం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే పలు కీలక సూచనలను పాటించాల్సి ఉంటుందన్నారు.
బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించాలి. స్టెరాయిడ్స్‌ను మోతాదులో మాత్రమే ఇవ్వాలి. అవసరానికి మించి ఇవ్వకూడదు. అలాగే స్టెరాయిడ్స్ వాడేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించాలి.. అని అన్నారు. ఈ విధంగా చేస్తే బ్లాక్ ఫంగస్ రాకుండా అడ్డుకోవచ్చని తెలిపారు.
కాగా కోవిడ్ వ్యాధి నుంచి కోలుకునే దశలో ఉన్న రోగులలో మ్యూకోమైకోసిస్ కేసులు ఎక్కువగా బయట పడుతున్నాయని, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ ప్రాణాంతకంగా మారుతున్నాయని, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిపై ఈ ఫంగస్ ఎక్కువగా దాడి చేస్తుందని తెలిపారు. కోవిడ్ -19 చికిత్సకు స్టెరాయిడ్ల వాడకంతో బ్లాక్ ఫంగస్ కేసులు ఇంకా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. బ్లాక్ ఫంగస్ వల్ల శ్వాస సమస్యలు వస్తున్నాయని, దగ్గులో రక్తం పడుతుందని అన్నారు. జాగ్రత్తలను పాటిస్తే బ్లాక్ ఫంగస్ రాకుండా ఆపవచ్చని తెలిపారు.