ఫంగస్ ఇన్ఫెక్షన్లు.. రంగుల వల్ల గందరగోళం… ఎయిమ్స్ డైరెక్టర్ ఏమన్నాడంటే,

-

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బందిపడుతుంటే ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఆ ఇబ్బందిని ఇంకా పెంచుతున్నాయి. కరోనా కన్నా ఎక్కువ భయాన్ని చూపుతున్న ఈ ఫంగస్ కేసులు జనాలని ఆందోళనకి గురి చేస్తున్నాయి. మొన్నటి దాకా ఒక్క బ్లాక్ ఫంగస్ మాత్రమే అనుకుంటే దాని తర్వాత వైట్, ఆ తర్వాత ఇప్పుడు ఎల్లో కూడా వచ్చేసింది. కరోనా తగ్గిన వారిలో కనిపిస్తున్న ఈ ఇన్ఫెక్షన్లు తీవ్ర ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఐతే ఈ ఫంగస్ పేర్ల విషయంలో బ్లాక్, వైట్, ఎల్లో రంగులు మరింత గందర గోళానికి గురి చేస్తున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రందీప్ గులేరియా పేర్కొన్నారు.

ఒక్కో ఫంగస్ ఒక్కోలా శరీరాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల వీటిని రంగులతో కాకుండా వాటి శాస్త్రీయ నామాలైన మ్యూకార్మైకోసిస్, కేండిడా ఇంకా ఆస్పర్జిల్లోసిస్ అని పిలవాలని అన్నారు. మనకు తెలిసిన ప్రకారం మ్యూకోర్మైకోసిస్ ప్రభావం కరోనా తగ్గిన వారిలో కనిపిస్తుంది. అది కూడా మధుమేహంతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా ఉందని తేలింది. అలాగే ఆస్పర్జిల్లోసిస్ ఫంగస్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల శ్వాసవ్యవస్థ మీద ప్రభావం పడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది.

ఇంకా ఆయన మాట్లాడుతూ థర్డ్ వేవ్ పిల్లలపై చూపుతుందన్న విషయమై, దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని, పిల్లల వైద్య బృందం కూడా ఆ విషయమై నిజమైన ఆధారాలు చెప్పలేకపోతున్నారని తెలిపారు. అదలా ఉంటే కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పిన ప్రకారం ప్రస్తుతానికి దేశంలో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 14.56కోట్లుగా(45సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల వారికి) ఉంది. అలాగే 18నుండి 44సంవత్సరాల వయసు వారు 1.06కోట్లు (మొదటి డోసు తీసుకున్నవారు) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news