BREAKING : కేటీఆర్‌పై వ్యాఖ్యలతో అక్బరుద్దీన్‌ ఓవైసీ సంచలన ప్రకటన

-

ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరగడం తెలిసిందే. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు, మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నదే ఏడుగురని, వారికి అధిక సమయం కేటాయించరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని కేటీఆర్ అన్నారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. తమ పార్టీ అధినేత అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిపై తాను పార్టీ చీఫ్ తో మాట్లాడతానని వెల్లడించారు. ఏడుగురు కాదు కనీసం 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేలా చూస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.

ఈసారి మరింతమంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెడతామని చెప్పారు. కాగా అంతకుముందు అసెంబ్లీలో అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ పాతబస్తీకి అన్యాయం జరుగుతోందంటూ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హామీలు ఇస్తారు కానీ అమలు చేయరని మండిపడ్డారు. పాతబస్తీలో మెట్రోరైలు సంగతి ఏమిటి? ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితేంటని ప్రశ్నించారు. బీఏసీలో ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు సరిగా కనిపించడం లేదన్నారు. టీవీ చర్చలకు వెళ్లే బీఆర్ఎస్ నేతలకు సభకు వచ్చే తీరిక లేదా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news