`సాహో` పైకి ఎటాక్ కి సర్వం సిద్ధం. `మిషన్ మంగళ్` అసలు మిషన్ మొదలైంది. ఇకపై ఆగస్టు 15 వచ్చే వరకూ ఒకటే యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేశారట. ఇకపై మిషన్ మంగల్ మూవీ ప్రమోషనల్ హీట్ ని పెంచేందుకు కిలాడీ అక్షయ్ కుమార్ టీమ్ రెడీ అవుతోంది. తొలిగా `మిషన్ మంగల్` టీజర్ తో బరిలో దిగారు. ఇంతకీ ఈ టీజర్ ఎలా ఉంది? సాహోని కొట్టేంత దమ్ము ఈ సినిమాలో ఉంటుందా? అంటే ఇప్పటికైతే సస్పెన్స్. ఓవైపు సాహో టీమ్ ప్రచారంలో వేడి పెంచేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 రిలీజ్ లక్ష్యంగా ప్రభాస్ – సుజీత్ – యువి క్రియేషన్స్ బృందం ప్రిపరేషన్ లో ఉన్నారు. త్వరలోనే ట్రైలర్ – ప్రీరిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక వీళ్లకు పోటీనా? అన్నట్టుగా కిలాడీ టీమ్ బరిలో దిగి ప్రచారంలో వేడి పెంచుతోంది. తాజాగా రిలీజ్ చేసిన `మిషన్ మంగల్` టీజర్ గ్లింప్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. టీజర్ ఇంప్రెస్సివ్.
మార్స్ పైకి తొలి స్పేస్ షిప్ ప్రయోగం `మిషన్ మంగల్`. అసలు ఈ ప్రయోగం ఎలా సాగింది? నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లే స్పేస్ షిప్ లాంచింగ్ టైమ్ లో ఎలాంటి టెన్షన్ వాతావరణం అలుముకుంది? ఇవన్నీ ఈ చిన్నపాటి టీజర్ లో చూపించారు. ఈ మిషన్ కి కమాండర్ గా కిలాడీ అక్షయ్ కుమార్ ఇనిషియేషన్ ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా టీజర్ ఆద్యంతం ఐదుగురు అందగత్తెలు సైంటిస్టులుగా కనిపించడం క్యూరియాసిటీని పెంచింది. టెన్షన్ వాతావరణంలో విద్యా బాలన్ – తాప్సీ- సోనాక్షి సిన్హా- నిత్యా మీనన్ – కీర్తి కుల్హరి సైంటిస్టులుగా కనిపించనున్నారు. ఎంత సైంటిస్టులు అయినా మిషన్ సక్సెసవ్వాలని పూజలాచరించే భక్తురాలిగా విద్యాబాలన్ ఈ చిత్రంలో కనిపిస్తోంది. కృతిక అగర్వాల్ పాత్రలో తాప్సీ కనిపించనుంది. జగన్ శక్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫాక్స్ స్టార్ తో కలిసి హోప్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. టీజర్ గ్లింప్స్ ఓకే. అయితే దాదాపు 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో ముందు మిషన్ మంగల్ ప్రతాపం ఎంత? అన్నది తెలియాలంటే ఆగస్టు 15 వరకూ ఆగాల్సిందే.
ఒకే తేదీకి ప్రభాస్ – సాహో, అక్షయ్ – మిషన్ మంగల్.. జాన్ అబ్రహాం- బట్లా హౌస్.. బాలీవుడ్ లో రిలీజవుతుండడంతో ఈ ముక్కోణపు పోటీపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. మిషన్ మంగల్ తరహాలోనే జాన్ అబ్రహాం నటిస్తున్న బట్లా హౌస్ నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. అయితే ఈ రెండూ ఫిక్షన్ స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సాహోకి ఎలాంటి పోటీనివ్వబోతున్నాయి? అన్నది వేచి చూడాల్సిందే.