కరోనా లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని సినిమాలు, సీరియల్స్, ఇతర షూటింగ్‌లు ఆగిపోయాయన్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ ఎత్తేశాక కూడా ఇప్పుడప్పుడే సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు సినీ నిర్మాతలు తమ సినిమాలను అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలపై విడుదల చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ”లక్ష్మీబాంబ్” మూవీ కూడా ఇప్పుడు వెబ్‌లోనే మొదటగా రిలీజ్ అవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
అక్షయ్ కుమార్ నటించిన కాంచన రీమేక్ మూవీ లక్ష్మీ బాంబ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మే 22వ తేదీన ఈ మూవీ విడుదల కావల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిదానంగా జరుగుతున్నాయి. అయితే లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశం లేకపోవడంతో.. సినిమాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో లక్ష్మీబాంబ్ మూవీని అక్షయ్ వెబ్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందులో భాగంగానే హాట్‌స్టార్ సిబ్బంది అక్షయ్ కుమార్‌ను తాజాగా సంప్రదించి ఈ విషయంపై చర్చించినట్లు తెలిసింది.
అయితే మొన్నీ మధ్యే అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ కూడా వెబ్‌లో ముందగా రిలీజ్ అవుతుందని భావించారు. కానీ ఆ సినిమా నిర్మాతలు అలాంటి విషయం ఏమీ లేదని, తాము మూవీని వెబ్‌లో రిలీజ్ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ మూవీపై కూడా ఇదే తరహాలో పుకార్లు వస్తున్నాయి. మరి ఇవి నిజమవుతాయా..? అక్షయ్ కుమార్ అలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారా..? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.