ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా – రష్యాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. గూఢచర్యం ఆరోపణలతో ఓ అమెరికన్ జర్నలిస్టును రష్యా అరెస్టు చేసింది. గురువారం రోజున అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అతనిపై క్రిమినల్ గూఢచర్యం కేసు మోపింది. అనంతరం మాస్కోలోని ఓ కోర్టులో ప్రవేశపెట్టగా.. మే 29వ తేదీ వరకు నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. రష్యాలో గూఢచర్యం కేసుల్లో దోషిగా తేలితే గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
‘ఇది ఎఫ్‌ఎస్‌బీకి సంబంధించిన విషయం. మాకు తెలిసినంతవరకు.. అతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ తెలిపారు. డబ్ల్యూఎస్‌జే ఉద్యోగి చేస్తున్న పనికి జర్నలిజంతో ఎటువంటి సంబంధం లేదని రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మరోవైపు వార్తాసంస్థ యాజమాన్యం.. ఎఫ్‌ఎస్‌బీ ఆరోపణలను ఖండించింది. గెర్ష్‌కోవిచ్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది.