గాంధీనగర్‌లో 12వేల కేజీల డ్రగ్స్‌ను నిర్వీర్యం చేయనున్న అమిత్‌ షా

-

మాదకద్రవ్యాల కట్టడికి కేంద్ర హోం శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టింది. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న 12వేల కేజీల డ్రగ్స్ ను నిర్వీర్యం చేయనుంది కేంద్ర హోం శాఖ. ఇవాళ గుజరాత్ లోని గాంధీనగర్ లో పర్యటించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో డ్రగ్స్ ను ధ్వంసం చేయనున్నారు.

ఇవాళ గాంధీ నగర్‌లో డ్రగ్స్ రవాణా, జాతీయ భద్రతపై జరిగే సమావేశంలో అమిత్‌ షా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి గోవా, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న12,438 కేజీల డ్రగ్స్‌ను నిర్వీర్యం చేయనున్నారు. వాటి విలువ అక్షరాలా రూ.632.68 కోట్లని ఆ వర్గాలు తెలిపాయి.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. 75 రోజుల్లో  75వేల కేజీల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని ఇది వరకే నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగా హోం మంత్రి ఈ ప్రక్రియను జులైలోనే ప్రారంభించారు. 31 వేల కేజీల డ్రగ్స్‌ను  చండీగఢ్‌లో ధ్వంసం చేశారు. మొత్తంగా నిర్దేశించిన సమయానికి కంటే ముందే 60 రోజుల వ్యవధిలోనే లక్ష కేజీలకు పైగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను రూపుమాపారు.

Read more RELATED
Recommended to you

Latest news