రేపు జమ్మూకాశ్మీర్ కు అమిత్ షా… అప్రమత్తమైన కేంద్ర బలగాలు

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో నెలకున్న పరిస్థితి, భద్రత వ్యవహరాల పై ఈ సందర్భంగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారుఅమిత్ షా. ఇక అమిత్ షా పర్యటన నేపథ్యంలో అదనంగా 25 పారామిలటరీ కంపెనీలను జమ్మూ కాశ్మీర్ కు తరలించారు. ఇటీవల వరుసగా ఔషధాల దుకాణం యజమాని ( కెమిస్ట్), టీచర్, ప్రిన్సిపాల్, కార్పెంటర్ ( వడ్రంగి), ఉత్తర ప్రదేశ్, బీహార్ కు చెందిన చిరువ్యాపారులతో సహా, మొత్తం 11 మంది పౌరులను చంపారు తీవ్రవాదులు.

ఈ హత్యలతో సంబంధమున్న మొత్తం 17 మంది తీవ్రవాదులను మట్టుపెట్టినట్లుగా చెబుతున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. 2019 ఆగస్టు 5 వ తేదీన పార్లమెంట్ లో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, కేంద్ర పాలిత ప్రాంతం గా మారిన తర్వాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తొలిసారిగా
పర్యటిస్తున్నారు.

అక్టోబర్ 23 వ తేదీ సాయంత్రం, శ్రీనగర్ నుంచి షార్జా కు తొలిసారిగా విమానయాన సేవలను ప్రారంభించనున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా… అక్టోబర్ 24 వ తేదీన జమ్మూ లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పారిశ్రామిక రంగానికి చెందిన పలు సంస్థల ప్రతినిధులను కూడా కలవనున్నారు అమిత్ షా. అయితే కేంద్ర హోమ్ మంత్రి పర్యటనను తీవ్రవాదులు అడ్డుకునే ప్రయత్నాలు చేయవచ్చని నిఘావర్గాల సమాచారం అందుతోంది. దాంతో అప్రమత్తమయ్యారు ఉన్నతాధికారులు.