చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..దీక్షకు ఎంపీ కేశినేని నాని మద్దతు

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై… వైసీపీ చేసిన దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షకు తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని కూడా మద్దతు పలికారు. ఈ మేరకు చంద్రబాబు దీక్ష శిబిరానికి చేరుకున్న ఎంపీ కేశినేని నాని… వైసిపి సర్కారుపై నిప్పులు చెరిగారు.

టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. జగన్ అంటే వీరుడు సూరుడని చెప్పుకుంటారని.. ఏదైనా ఉంటే చెప్పండి డైరెక్ట్ ఫైట్ అన్నారు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్సా..? వీఎంసీ గ్రౌండ్సా ఏదోకటి తేల్చేసుకుందామని సిఎం జగన్ కు సవాల్ విసిరారు. వైసీపీ నేతలు టైమ్.. డేట్ చెబితే మేమూ వచ్చేస్తామని.. వైసీపీ ఎక్కడంటే అక్కడ మా వాళ్లు రెడీగా ఉన్నారు.. కొట్టుకుందాం అంటే కొట్టేసుకుందామని స్పష్టం చేశారు.

రోజూ కొట్టుకుంటూ ఏపీకి చెడ్డ పేరు తేవద్దని.. జగన్ రాక్షస పాలనను ప్రపంచం అంతా చెప్పుకుంటోందని నిప్పులు చెరిగారు. రౌడీయిజం, గుండాయిజం అంటే పిరికిచర్య అని.. 2019 లో జగనుకు గొప్ప అవకాశం వచ్చిందన్నారు. ఆ గొప్ప అవకాశం వస్తే గొప్పగా పాలించి ప్రజా తీర్పును గౌరవించాలని చురకలు అంటించారు. ఏం చేసినా ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది చెల్లుబాటు కాదని.. ఓటర్లు తగిన సమయంలో మూల్యం చెల్లిస్తారని స్పష్టం చేశారు.