అమూల్ పాల ధరలు మరోసారి పెరగనున్నాయి. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర ధరలు పెరగనున్నాయి. ఈ పెరిగిన రేట్లు జూలై 1 నుంచి అంటే రేపటి నుంచే అమలులోకి రానున్నాయి. అమూల్ బ్రాండ్ నేమ్ గా దేశవ్యాప్తంగా పాల విక్రయ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న సహకార మార్కెటింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఈ ధరల పెంపు ప్రభావం ఒక్క పాల పైనే కాకుండా ఇతర ఉత్పత్తులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కొత్త ధరలు అన్ని అమూల్ పాల బ్రాండ్లైన గోల్డ్, తాజా, శక్తి, టి-స్పెషల్, అలాగే ఆవు మరియు గేదె పాలకు వర్తిస్తాయని చెప్పారు. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో పాల ధరల పెరుగుదల అవసరమని సోధి చెప్పారు. అదనంగా ప్యాకేజింగ్ ఖర్చు 30 నుండి 40 శాతం పెరిగిందని.. అలాగే రవాణా ఖర్చు 30 శాతం, ఇంధన వ్యయం 30 శాతం పెరిగిందని.. చెప్పిన ఆయన.. ఇది ఇన్ పుట్ వ్యయం పెరగడానికి దారితీసిందని వెల్లడించారు. ఈ కారణాల వల్లే పాల ధరను మరో రూ. 2 పెంచుతున్నామని స్పష్టం చేశారు సోధి.