ఇంట్లో గ్యాస్ బిల్లు, పవర్ బిల్లు, టీవీ బిల్లుతో పాటు తాగేనీటికి కూడా నెలనెల ఇంత అని తీసి పక్కన పెడతాం.అయితే అన్నీ ఖర్చులకంటే ఇంట్లో వాటర్ ఖర్చు తక్కువగా ఉంటుంది. వాడకం ఎక్కువగా ఉంటుంది. 20 రూపాయలు పెడితే.. క్యానెడ్ నీళ్లు వస్తాయి. అవి ఇక ఇంట్లో మనషులను బట్టి రెండు రోజులు, మూడు రోజులు కూడా వస్తుంటాయి కదా.. మనకు ఇంకా బయటు వెళ్లేప్పుడు కూడా ఇంట్లో వాటర్ నే బాటిల్ లో పట్టుకెళ్లడం అలవాటు.
సో ఇలా మొత్తానికి వాటర్ కు నెలకు గట్టిగా ఐదు వందలు కూడా ఖర్చుకావు.. కానీ ఒక అతను కేవలం మంచినీళ్ల కోసమే నెలకి లక్షన్నర ఖర్చు చేస్తున్నాడట. ఇక ఇది వినగానే.. క్రికెటర్ కోహ్లీ తాగే వాటర్ కంటే తక్కువేలే అనుకుంటారు. ఫేమస్ పర్సన్స్ చేస్తే ఇప్పుడు పెద్ద మ్యాటర్ కాదు.. కానీ ఇతను ఏమంత ప్రముఖుడు కాదు..ఏ క్రికెటరో, సినిమా స్టారో అంతకంటే కాదు.. మరి ఎవరూ..?
టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఓ కుర్రాడు. అతనికి చిన్నతనం నుంచీ ఇంట్లో మంచి నీళ్లు నచ్చేవి కాదట. హోటళ్లూ, థియేటర్లూ, ఇతర ప్రాంతాలకు ఎక్కడికెళ్లినా అక్కడా మంచినీళ్లు రుచించకపోవడంతో పదిహేనేళ్లుగా నార్వేకు చెందిన వోస్ అనే సంస్థ మంచి నీళ్లనే తాగుతున్నాడు. వాటిని నాలుగైదుసార్లు ఫిల్టర్ చేయడంతోపాటు ప్రత్యేకంగా శుద్ధి చేస్తారట.
అందుకే రయాన్ ఖరీదు ఎక్కువైనా గాజు సీసాల్లో వచ్చే వోస్ నీళ్లను నెలకు సరిపడా ఒకేసారి తీసుకొచ్చుకుంటాడు.. వాటిని నిల్వ చేసుకోవడానికి నాలుగు ఫ్రిజ్‌లు కూడా కొనిపెట్టాడు.. హోటల్, సినిమా థియేటర్, జిమ్, షాపింగ్… ఇలా మనోడు ఎక్కడకు వెళ్లినా ఆ నీళ్ల సీసాలు అతని వెంట ఉండాల్సిదే. ఈ మధ్య ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యాడు రయాన్. విషయం తెలిసి అందరూ విస్తుపోయారు. నచ్చకపోతే మరీ ఇలా చేస్తారా అనుకుంటూ అందరూ ముక్కున వేలుసుకున్నారు.
డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెట్టేస్తున్నావేంట్రా అని మనం అప్పుడుప్పుడు అంటుంటాం..ఇతను నిజంగా మంచినీళ్లకే డబ్బు ఖర్చుపెడుతున్నాడు కదా..! అయితే నచ్చకపోవడానికి ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన కారణం ఉందా అనేది అతను ప్రస్తావించలేదు.
-Triveni Buskarowthu