ఏప్రభుత్వమైనా.. ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలను ఎంత ఆలస్యమైతే.. అంత బావుణ్ణు అని భావిస్తుంది. ముందు ఎన్నికలు కాబట్టి.. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలి కాబట్టి.. ఏవేవో వల్ల మాలిన హా మీలను కుమ్మరిస్తారు. తీరా అధికారంలోకి వచ్చి.. వాటిని అమలు చేయాలంటే మాత్రం ఎంత ఆలస్యమై తే.. అంత మంచిదని భావిస్తారు. దీనికి కారణం.. ఆర్థిక సమస్యలే! ప్రారంభించినా.. ఏదొ మొక్కబడిగా సదరు కార్యక్రమాలను అమలు చేస్తారు. దీంతో మొత్తం వ్యవహారం.. అంతా తెమిలి.. ప్రజల్లో నిజమైన లబ్ధి దారుకు ఫలితం దక్కేసరికి ఏడాదో.. రెండోళ్లో గడిచి పోవడం ఖాయం. ఇది సర్వసాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా జరిగేదే!
పైగా.. ప్రభుత్వం ఇచ్చే ఫలాలపైనా నిఘా అంటూ ఏమీ ఉండదు. ఎవరికి ఏది అందుతోందో.. ఎవరు దేనిని అందుకోలేక పోతున్నారో.. వంటివిషయాలను కూడా పట్టించుకునేందుకు ప్రభుత్వాలకు తీరిక ఉండదు. కానీ, వీటికి భిన్నంగా వ్యవహరిస్తోంది.. ప్రస్తుత జగన్ ప్రభుత్వం ఏపీలో! ఏ పథకమైనా.. పక్కా ప్లాన్ ప్రకారం .. ప్రజలకు చేరువ కావాల్సిందే. టైం ప్రకారం ఆయా ఫలాలు అందాల్సిందే అనేలా ఒక గైడ్ పెట్టుకుని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. అంతేకాదు, ప్రస్తుత కరోనా సమయంలో ప్రజల వద్ద డబ్బులు లేవని గుర్తించిన ఆయన.. వివిధ సంక్షేమ పథకాలను ముందుగానే అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వరుసగా రెండో ఏడాది అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా రెండో విడత నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. కోవిడ్-19 కారణంగా 6 నెలల ముందుగానే ప్రభుత్వం సాయం అందించడం విశేషం. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారును ఆరు మాసాల ముందుగానే సంక్షేమ రాగం ఆలపిస్తున్న ప్రభుత్వంగా పేర్కొంటున్నారు వైసీపీ అభిమానులు, ప్రజలు కూడా! నిజమేకదా!!