కరోనా కారణంగా ఈ ఏడాది పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రను నిర్వహించవద్దని సర్వోన్నత న్యాయస్థానం గురువారం అత్యవసర ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్రం, ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీన్ని విచారించిన కోర్టు.. జగన్నాథ రథయాత్రకు అనుమతిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోనే త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది.
అయితే, కేవలం పూరీలో మాత్రమే రథయాత్ర నిర్వహణకు అనుమతిస్తున్నామన్న ధర్మాసనం… ఒడిశాలోని మరే ప్రాంతంలోనూ నిర్వహించరాదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ కారణంగా భక్తులు లేకుండా కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూ యాత్రను నిర్వహించాలని ఆదేశించింది. దీంతో కేవలం ఆలయ పూజారులు, సిబ్బంది సమక్షంలోనే ఈ ఏడాది పూరీ రథయాత్ర జరగనుందని పూరీ గజపతి మహారాజ్ జీ భక్తులకు విన్నవించారు.