ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆసరా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలకు, వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను పక్కకు పెట్టాలని ఈసీ ప్రభుత్వానికి సూచించింది. వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెన్షన్ల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సారి పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరని క్లారిటీ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందిస్తామని తెలిపారు. లబ్దిదారులు నేరుగా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తెచ్చుకోవాలని సూచించారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు. వాలంటీర్లపై ఆంక్షల నేపథ్యంలో పెన్షనర్లు ఎవరూ భయపడాల్సిన అసవరం లేదని చెప్పారు. చంద్రబాబు కడుపు మంటతోనే ఎన్నికల కమిషన్ ద్వారా వాలంటీర్ల సేవలను నిలిపివేసేలా చేశారని ఫైర్ అయ్యారు.