నిన్నటితో జగన్ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది.ఈ నేపథ్యంలో జగన్ చాలా ఆనందంగా ఉన్నారు. సంక్షేమాన్ని ఇంకా పరుగులు పెట్టిస్తానని అంటున్నారు. ఇదే సమయంలో ఇవాళ్టితో అమరావతి ఉద్యమం 800 రోజులు పూర్తి చేసుకుంది. రెండు వేర్వేరు విషయాలుగా పైకి కనిపించినా కూడా సారూప్యత విషయంలో చాలా ఉమ్మడి అంశాలే దాగి ఉన్నాయి. ముఖ్యంగా వెయ్యి రోజుల పాలనలో జగన్ నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని యనమల ఆరోపిస్తున్నారు. లక్ష కోట్లు (సుమారు) నిధులు అసలు బడ్జెట్ అనుమతి లేకుండానే వాడేశారని కాగ్ అంటోంది. ఈ రెంటిపై ముఖ్యమంత్రి జగన్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.వీటితో పాటు రెండు వేల కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధికి తాము నిధులు ఇచ్చామని చెబుతున్నా, సంబంధిత పనులేవీ ఇంతవరకూ ప్రారంభమే కాలేదని జనసేన జగన్ సేనను ప్రశ్నిస్తోంది.దీనిపై కూడా మాట్లాడాల్సినంత మాట్లాడితే అధికార పార్టీ పౌరుల సందేహాలకు సమాధానం ఇస్తే ఇంకా మేలు.
ఇక సంక్షేమానికి సంబంధించి నిధుల కేటాయింపు బాగున్నా జగన్ పాలనలో అభివృద్ధి పరంగా ఎటువంటి కేటాయింపులూ లేవు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు దృష్టి సారించడం లేదు. నాడు నేను బిల్లుల చెల్లింపేలేకుండా ఉంది. ఇవన్నీ పరిష్కరిం చాల్సిన విషయాలు.వీటిపై స్పందించాల్సినంత స్పందించాక అప్పుడు వైసీపీ,మిగతా విషయాలపై దృష్టి సారిస్తే మేలు. ఉద్యోగుల జీతభత్యాల వివాదం ఎలా ఉన్నా కొన్ని అనాలోచిత నిర్ణయాలు మాత్రం జగన్ చుట్టూ ముళ్ల కంచెల మాదిరిగా మారుతున్నాయి. ముఖ్యంగా 3 రాజధానుల పేరిట జగన్ చెబుతున్నవి తరువాత చేస్తున్నవి వేటిపై కూడా ఇవాళ స్పష్టత లేదని అమరావతి పరిరక్షణ సమితి అంటోంది.
అదేవిధంగా సినిమా టికెట్ ధర తగ్గింపుపై కూడా ముందొక నిర్ణయం తీసుకుని తరువాత సవరణ చేసి, అటుపై జీఓ ఇవ్వకుండా తాత్సారం చేయడం కూడా తగదని అంటోంది మరోవైపు జనసేన. తమ సినిమాను తమనూ నియంత్రించాలనుకోవడం అన్నది జగన్ కు సాధ్యం కాదని కూడా సవాల్ చేస్తోంది. వీటితో పాటు గ్రామ వలంటీర్ల జీతాల పెంపుపై ఇప్పటిదాకా ఎటుంటి నిర్ణయమే లేదు. ఐదు వేల జీతానికే వీళ్లంతా పనిచేస్తున్నారు. ఎనిమిది వేలు చేస్తామని చెప్పి మరిచిపోయారు. వీటితో పాటు సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్ పీరియడ్ ను కూడా కన్ఫం చేయలేదు.ఇవన్నీఇప్పుడున్న ప్రతిబంధకాలు.