ఏపీ టిడిపి అధ్యక్షుడిగా ఆయన … తెలుగు యువత అధ్యక్షుడిగా ఈయన ?

తెలుగుదేశం పార్టీలో ఏం జరగకపోయినా , ఏదో జరుగుతుంది అనే హడావుడి మాత్రం ఎప్పుడూ  చోటుచేసుకుంటునే వస్తోంది. పూర్తిగా పార్టీ నేతలు భయాందోళనలు పెరిగిపోతుండటంతో ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా చంద్రబాబు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఏపీలో జమిలి  ఎన్నికలు రాబోతున్నాయి అంటూ చంద్రబాబు హడావుడి చేశారు. కేంద్రంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశమే లేదంటూ కేంద్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, చంద్రబాబు మాత్రం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే జమీలి ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారు.
బాబు సంగతి ఇలా ఉంటే, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అనేక కథనాలను ప్రచారం చేస్తూ వస్తున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడి ని మర్చబోతున్నారు అని,  మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి ఆ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాగే తెలుగు యువత అధ్యక్షుడిగా యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ కు ఆ పదవిని కట్టబెట్టబోతున్నారు అంటూ హడావుడి చేస్తున్నారు. పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు త్వరలోనే మండల జిల్లా కార్యవర్గాల ను పూర్తిగా ప్రక్షాళన చేసి, ఉత్సాహవంతులైన వారికి ఆ పదవులను కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు.
ఆ కమిటీల నియామకం పూర్తయిన తర్వాత రాష్ట్ర కమిటీల నియామకం ఉంటుందని,  ఆ సమయంలో టీడీపీ అధ్యక్ష పదవి అచ్చెన్న, తెలుగు యువత అధ్యక్ష పదవి పరిటాల శ్రీరామ్ కు అప్పగిస్తారని ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవంగా తెలుగు యువత అధ్యక్ష పదవికి ముందుగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరును పరిగణనలోకి తీసుకున్నారని, కానీ అచ్చెన్న, రామ్మోహన్ ఓకే కుటుంబ సభ్యులు కావడంతో ఆ ప్రయత్నాలను విరమించారు అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాస్తవంగా చంద్రబాబు సైతం ఇదే రకమైన ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
-Surya