ఫోటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేస్తే..నేనూ టీవీల్లో కనిపించే వాణ్ని – జగన్‌

ఇవాళ కోనసీమ వరద ప్రాంతాల్లో జగన్‌ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లంక గ్రామాల్లో వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలను వింటున్న సీఎం… ముంపు బాధితులతో వారికి అందుతున్న ప్రభుత్వ సాయం పై ఆరా తీశారు. లంక గ్రామాల్లో బురదలోనే కాలి నడకన తిరుగుతూ నేరుగా బాధితులతో మాట్లాడుతున్న సీఎం… ప్రభుత్వ సహాయక శిబిరాల్లో బాగా చూసుకుంటున్నారా అని బాధితులను ప్రశ్నించారు.

అంచనాలు పూర్తి కాగానే ఆదుకుంటామని.. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామనిహామీ ఇచ్చారు. నాది ప్రచార ఆర్భాటం కాదని.. నేను కూడా వరదల సమయంలో ఇక్కడికి వచ్చి, ఫోటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేస్తే టీవీల్లో కనిపించే వాణ్నిఅని పేర్కొన్నారు. కానీ దాని వల్ల ఏం ప్రయోజనం? ముఖ్యమంత్రి అనే వాడు వ్యవస్థలను నడిపించాలని పేర్కొన్నారు.

ప్రజలకు మంచి జరిగేలా చూడాలి.. సరైన సమయంలో సరైన సహాయం అందేలా చూడాలని కోరారు. ఆ తర్వాత అది అందిందా.. లేదా.. అన్నది చూడాలని… అదే విధంగా అధికారులు తమ విధులు సమర్థంగా నిర్వర్తించేలా నిర్దేశించాలని ఆదేశించారు. వారికి తగిన వనరులు కూడా సమకూర్చాలి… అందుకే సహాయ పనులు, కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా అధికారులకు వారం రోజుల సమయం ఇచ్చానని స్పస్టం చేశారు.