2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. టిడిపి కార్యాలయంలోకి దూసుకువెళ్లి కార్యాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న టిడిపి నేతలు, కార్యకర్తల పైన దాడులకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతుంది. ఈ దాడి కేసులో మరో కీలక నేతను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న లేళ్ల అప్పిరెడ్డి బెంగుళూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకొని.. మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించనున్నారు. ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అలాగే వైసిపి నేతలు దేవినేని అవినాష్, తలశీల రఘురాం తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా ఈ కేసులో నందిగాం సురేష్ ను హైదరాబాదులో అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం.