“నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటే.. ఒకరకంగా కుటుంబ పెద్దని. రాష్ట్రానికి ఏం చేయాలో..ఏం సాధించాలో.. ఎలా ముందుకు తీసుకు వెళ్లాలో.. నాకు తెలియదా? మీరు నాకు చెప్పేవారా? నా రాజకీయ అనుభవం అంత లేదు.. మీ వయసు“-ఇదీ చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రతిపక్షం వైసీపీని, వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. మరి ఈ కుటుంబ పెద్ద ఏం చేశారు? గడిచిన ఐదేళ్లలో ఆయన ఇచ్చిన హామీలను, ఎన్నికల్లో చెప్పిన మాటలను ఏమేరకు అమలు చేశారు. అంటే.. ఎక్కడికక్కడ కొర్రీలు పెట్టి వెళ్లిపోయారు. అన్ని సామాజిక వర్గాలు సహా అన్నవృత్తుల వారినీ దగా చేశారనే అంటున్నారు పరిశీలకులు.
రైతులకు ఇస్తానన్న రుణమాఫీని పూర్తిగా చేయలేక పోయారు. చిన్న మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకు ఇస్తానన్న సహాయా న్ని ఇవ్వకుండానే అధికారం నుంచి దిగిపోయారు. ఇక, డ్వాక్రా మహిళలకు చేస్తానన్న రుణ మాఫీ సంగతి కూడా అలానే ఉంది. అదేసమయంలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తానన్న సొమ్మును కూడా ఇవ్వకుండానే వెళ్లిపోయారు. నిజానికి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇవన్నీ ఎంతో దోహద పడ్డాయి. కానీ, తాను పాలనలో ఉన్న సమయంలో ఏదో విదించిన చంద్రబాబు.. అందరికీ టోకుగా కుచ్చుటోపీ పెట్టారు. ఇక, గత ఏడాది అధికారంలోకి వచ్చిన జగన్‌పై ఇవన్నీ ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు. అంటే.. కొంత పచ్చిగా చెప్పాలంటే.. తన బిడ్డను జగన్ సాకాలని చెప్పుకొచ్చారు.
ఆదిలో జగన్ మాత్రం తాను ఎందుకు చేయాలని, ఇవన్నీ మీ హామీలు.. పార్టీ పరంగా.. ప్రభుత్వం పరంగామాకుండే ప్రాధాన్యాలు మాకు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో జగన్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న మేధావులు సైతం చంద్రబాబునే తప్పుపట్టారు. అయితే, ఏడాది గడిచే లోపు.. ఆయా వర్గాలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన జగన్.. బాబు బాధ్యతను కూడా తన భుజాలపైనే వేసుకున్నారు. రైతులు నుంచి డ్వాక్రా మహిళల వరకు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల నుంచి అన్ని వర్గాల వారికీ చంద్రబాబు చేస్తానని చెప్పి చేయకుండా వదిలేసిన సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా గత సర్కారు పెండింగ్‌లో పెట్టిన పంటల బీమా పరిహారం(క్లెయిమ్) చెల్లింపులకై.. రూ. 596.36 కోట్లు విడుదల చేశారు.
ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. తద్వారా 5,94,005 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మరి ఇంతగా చేస్తున్నజగన్‌ను చంద్రబాబు ఏమొహం పెట్టుకుని విమర్శిస్తారు? అనే ప్రశ్న వస్తోంది. దీనిని టీడీపీ మేధావులు కానీ, ఆ పార్టీ ని సపోర్టు చేసే మీడియా కానీ.. సమాధానం చెప్పకపోవడం గమనార్హం. పైగా ఈ వార్తలను కూడా లైట్ వెయిట్‌లో తీసిపారేయడం గమనార్హం. ఏదేమైనా ఈ పరిణామాలను గమనిస్తున్నవారు మాత్రం .. చంద్రబాబు, జగన్‌లలో ఎవరు ప్రజా పక్షమో తేల్చుకునేందుకుపెద్దగా సమయంలో అవసరలేదని అంటున్నారు. నిజమే కదా!!