ఇద్దరు నేతల మద్య వివాదం వస్తే.. దానికి పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. ఇద్దరు అధికారుల మధ్య తేడా వస్తే..దానికీ పరిష్కారం దొరుకుతుంది. కానీ, అత్యంత కీలకమైన శాసన వ్యవస్థ-న్యాయ వ్యవస్థల మధ్య అగాథం పెరిగితే..ఏమవుతుంది ? ఇది ఎటు దారి తీస్తుంది ? ఇప్పుడు ఏపీ పరిణామాలను గమనిస్తున్న వారు ఈ ప్రశ్నలే సంధిస్తున్నారు. ఏపీలో హైకోర్టు ఇస్తున్న తీర్పులు.. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని ఇటీవల కాలంలో సర్కారు పెద్దలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. పైగా హైకోర్టులోని ఒకరిద్దరు న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు మరింతగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన వైసీపీ నేత, సీఎం జగన్‌కు సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి.. న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలను తీర్పులో భాగంగా చేయాలని కోరారు. వాటిపై అప్పుడు తాము సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి దీనిపై హైకోర్టు మౌనం పాటిస్తుందని అనుకున్నా.. వ్యాఖ్యలు చేసే అధికారం తమకు ఉందని సదరు న్యాయమూర్తి చెప్పుకొచ్చారు. అక్కడితో.. ప్రభుత్వానికి-హైకోర్టుకు మధ్య దూరం మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సీఎం జగన్ నేరుగా హైకోర్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డేకు లేఖ రాయడం, దానిని మీడియాకు బహిరంగ పరచడం తెలిసిందే.
ఇక, ఈ వివాదంపై అనే వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు తెరమీదికి వచ్చాయి. న్యాయ వ్యవస్థతో పెట్టుకున్నారు కాబట్టి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నారు. కానీ, ఇక్కడే ఓ కీలక విషయం గుర్తించాలి. గతంలోనూ ఇలాంటి వివాదాలు అనేకం తెరమీదికి వచ్చాయి. తమిళనాడు, కర్ణాటక హైకోర్టులపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. నేరుగా తమకు ఆయా కోర్టులపై నమ్మకం లేదన్న సందర్భాలు ఉన్నాయి. దీనికి చక్కని ఉదాహరణ..తమిళనాడులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న దివంగత సీఎం జయలలిత. తన కేసు విచారణను వేరే రాష్ట్రానికి తరలించాలని ఆమె స్వయంగా సుప్రీం కోర్టుకు విన్నవించుకోవడంతో కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు.
ఇక, ఇప్పుడు కూడా ఏపీ సీఎం జగన్ పాలనపై హైకోర్టు ఇస్తున్న తీర్పుల విషయంలో అసంతృప్తితో ఉన్న పాలకులు.. ఇదే ఆలోచనతో ఉన్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎలాగూ దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తికి ఫిర్యాదు చేశారు కనుక.. ఏదైనా.. ఆయనే తేల్చాల్సి ఉంటుందని. పైగా సుప్రీంలోని కీలక జడ్జి జస్టిస్ ఎన్వీ రమణకు, మాజీ సీఎం చంద్రబాబుకు, మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు కూడా లింకులు ఉన్నాయని.. అందుకే తమపై ఇలా తీర్పులు వస్తున్నాయని, జస్టిస్ ఎన్వీ రమణ కనుసన్నల్లోనే ఏపీ హైకోర్టు పనిచేస్తోందని కూడా సీఎం జగన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రేపు ఇవే పరిణామాలు ఇతర రాష్ట్రాల్లోనూ వచ్చే అవకాశం ఉన్నందున సుప్రీం దీనిని సీరియస్‌గా పరిగణించే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.
-vuyyuru subhash