పదో తరగతి వరకు వారిని అక్కడే చదవనీయండి : ఏపీ హైకోర్టు

‌బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్దులకు 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న పాఠశాలల్లోనే విద్య కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 19పై మాల మహానాడుతో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీన్ని రద్దు చేయటంతో ఈ పథకం కింద చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్ అంధకారమవుతుందని కోర్టుకు వివరించారు. వారి విద్యను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రస్తుతం ఈ పథకం ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులను 10వ తరగతి వరకు అదే పాఠశాలలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివించేందుకు 2008లో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 విద్యా సంవత్సరం వరకు పక్కాగా అమలు చేశారు. స్థానికంగా అందుబాటులో ఉన్న మెరుగైన ప్రైవేటు పాఠశాలల్లో 1, 5, 8 తరగతుల్లో ప్రవేశాలు కల్పించి, ఫీజులు ప్రభుత్వమే చెల్లించేది. ఒకటో తరగతి విద్యార్థులకు లాటరీ ద్వారా, 5, 8 తరగతుల విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసేవారు.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.65 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలలోపు ఉన్నవారు దీనికి అర్హులు. రెసిడెన్షియల్‌ విద్యార్థులకు ఏడాదికి రూ.30 వేలు, నాన్‌ రెసిడెన్షియల్‌ వారికి రూ.20 వేలు చొప్పున మంజూరు చేశారు. ఇలా 10వ తరగతి వరకు అవకాశం కల్పించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి నిధులు నిలిపేసింది. దీంతో వివిధ ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.