అచ్చెన్న‌కు బాబు ఆఫ‌ర్‌.. కండిష‌న్ దిమ్మ‌తిరిగిపోయిందిగా…!

-

రాజ‌కీయాల్లో మార్పు స‌హ‌జం. ఎప్పుడూ ఒకే విధంగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తే.. వారికంటూ ప్ర‌త్యేక‌త ఏముంటుంది ? అందుకే నాయ‌కులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నారు. అంతేకాదు, అనుభ‌వాల నుంచి పాఠాలు కూడా నేర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇష్ట‌మైనా.. క‌ష్ట‌మైనా.. వారి ప్ర‌తిపాద‌న‌ల‌కే వారు ప‌రిమిత‌మ‌వుతున్నారు. త‌మ‌దైన ముద్ర వేసేందుకు ఇంత‌క‌న్నా ఉత్త‌మ‌మైన మార్గం లేద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాము న‌మ్మిన సిద్ధాంతానికే ప‌రిమిత‌మ‌వుతున్నారు.


తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో వెలుగు చూసింది. ఇటీవ‌ల ఈఎస్ ఐ కేసు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలోని ఇంటికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో పార్టీలోని నాయ‌కులు ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు క్యూ క‌ట్టారు. చంద్ర‌బాబుకూడా ఆయ‌న‌ను విజ‌య‌వాడ‌లో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఓ సంచ‌ల‌న విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కునారిల్లిపోయిన టీడీపీని గాడిలో పెట్టేందుకు కీల‌క‌మైన నాయ‌కుడు పార్టీకి అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలో ఏపీ టీడీపీ ప‌గ్గాల‌ను అచ్చెన్న‌కు అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు అచ్చెన్న‌కు వ‌ర్త‌మానం అందింది.

బ‌ల‌మైన వాయిస్ వినిపించే నేత‌, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన వ్య‌క్తి కావ‌డం.. మొన్న ఇంత వ్య‌తిరేక గాలుల్లోనూ ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో అచ్చెన్న‌కు పార్టీ ప‌గ్గాలు ఇస్తేనే పార్టీకి ఇటు బీసీల్లోనూ, అటు ఉత్త‌రాంధ్ర‌లోనూ ప్ల‌స్ అవుతుంద‌న్న‌దే చంద్ర‌బాబు ప్లాన్‌. ఇక బాబు అచ్చెన్న వ‌ద్ద పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ప్ర‌తిపాద‌న పెట్టిన వెంట‌నే దీనిపై అచ్చెన్న త‌న‌దైన స్టైల్‌లో స్పందించార‌ట‌. పార్టీని న‌డిపించేందుకు తాను రెడీనేన‌ని చెప్పిన మాజీ మంత్రి.. అయితే, ఈ విష‌యంలో త‌న‌కు ఫ్రీహ్యాండ్ కావాల‌ని కండిష‌న్ పెట్టారు.

అంటే.. అధ్య‌క్షుడిగా తాను తీసుకునే నిర్ణ‌యాలు, చేసే ప‌నుల్లో మ‌రొక‌రు వేలు పెట్ట‌డాన్ని ఆయ‌న స‌హించేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టార‌ట‌. ఈ విష‌యం ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత‌ల వ‌ద్ద ప్ర‌స్తావ‌న‌కు రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది ఆయ‌న ఎందుకు చెప్పారో వేరేగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం అధ్య‌క్షుడిగా ఉన్న క‌ళా వెంక‌ట్రావుకు స్వ‌తంత్రం లేద‌నేది అంద‌రికీ తెలిసిందే. బాబు కుమారుడు మాజీ మంత్రి.. లోకేష్ అన్ని విష‌యాల్లోనూ వేలు పెట్టేవారు. దీంతో వెంక‌ట్రావు నిర్ణ‌యాలకు విలువ ఉండేది కాదు. ఈ విష‌యంలో పార్టీలో అప్ప‌ట్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇదే విష‌యాన్ని ముందుగా ప‌సిగ‌ట్టిన అచ్చెన్న‌.. తాను అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌డితే.. త‌ను తీసుకునే నిర్ణ‌యాల‌ను మ‌రొక‌రు స‌మీక్షించ‌రాద‌ని కూడా ఆయ‌న ష‌రతు పెట్టార‌ని తెలుస్తోంది. అయితే, వీట‌న్నింటికీ.. చంద్ర‌బాబు ఓకే చెప్పార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. అలాగే అచ్చెన్న ప్ర‌తిదానికి క‌ళాలా త‌లూపే వ్య‌క్తి కూడా కాక‌పోవ‌డంతో చాలా మంది నేత‌ల ఆట‌లు అయితే ఖ‌చ్చితంగా సాగ‌వు. ఏదేమైనా.. అచ్చెన్న వ్యూహం ఫ‌లిస్తే ఏపీలో టీడీపీ రాజ‌కీయం స‌రికొత్త‌గా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news