రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు తెరమీదకి వస్తాయో చెప్పడం కష్టం. మిత్రపక్షాలే అయినా.. చూసీ చూడనట్టు వ్యవహరించే పరిస్థితి ఇప్పటి రాజకీయాల్లో లేదు. ఎవరికి స్వార్థం వారిదే. ఎవరి వ్యూహం వారిదే. ఇప్పుడు ఈ పరిస్థితే..జనసేన-బీజేపీ మిత్రపక్షంలోనూ కనిపిస్తోంది. నిన్న మొన్ననే ఈ రెండు పార్టీలు జట్టుకట్టాయి. కలిసి ముందుకు వెళ్తామని, పార్టీలు రెండైనా.. ఆత్మలు ఒక్కటేనని బీజేపీ నేతలు ఢంకా బజాయిస్తే.. మాలాంటి మిత్రపక్షం దేశంలోనే ఉండదనేలా వ్యవహరిస్తామని.. జనసేనాని పవన్ కళ్యాణ్ నొక్కి వక్కాణించారు. అయితే, ఇలా అన్నారే కానీ.. లోలోన పరిస్థితిని గమనిస్తే.. ఎవరి వ్యూహాలు వారివే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో జనసేన సొంతగానే పోటీకి దిగాలని నిర్ణయించుకోవడం పెద్ద సంచలనం. అంతేకాదు, 40 కార్పొరేట్ సీట్లలో అభ్యర్థుల వెతుకులాట కూడా ప్రారంభమైంది. అయితే, మా పొత్తు ఏపీలోనేనని జనసేన నేతలు చెప్పుకొచ్చారు. పోనీ.. ఏపీ విషయాన్ని తీసుకుంటే.. బీజేపీతో కలిసి ముందుకు ఆశించిన విధంగా సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయినా కూడా ఇరు పక్షల నాయకులు కలిసే ఉన్నామని చెబుతున్నారు. కాగా, ఇప్పుడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే.. వచ్చే రెండు మూడు మాసాల్లో ఇక్కడ ఉప పోరు జరగనుంది.
ఈ నేపధ్యంలో బీజేపీ ఇక్కడ పోటీకి ఉవ్విళ్లూరుతోంది. గతంలో ఒకటి రెండు సార్లు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కిన నేపథ్యంలో మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీజేపీ కీలక నేతలు బయట పెడుతున్నారు. వచ్చే ఉప ఎన్నికలో తాము పోటీకి దిగుతామని, హిందూ ఓట్లన్నీ తమవేనని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, జనసేనతో మిత్రత్వం ఉన్న నేపథ్యంలో ఇలా మీకు మీరుగా ప్రకటించడం సాధ్యమేనా ? అన్న ప్రశ్నకు బీజేపీ నేతలు షాకింగ్ ఆన్సర్లు ఇస్తున్నారు.
గతంలో జనసేన ఇక్కడ నుంచి పోటీ చేసిందని… కానీ ఓడిపోయిందని.. పైగా ఇప్పుడు ఆ పార్టీకి కేండెట్ కూడా లేరని.. ఈ నేపథ్యంలో తమకు కేటాయిస్తే.. గెలుపు గుర్రం ఎక్కుతామని.. పరోక్షంగా ఇది జనసేన విజయమే అవుతుంది కదా? అని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి వంటి నేతలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే.. ఈ సీటు విషయంలో ముందుగానే తామొక స్కెచ్ వేసుకుని జనసేన కాళ్లకు ముందరి బంధాలు వేయాలని చూస్తున్నారనేలా పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపైజనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.
-vuyyuru subhash