ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు షాకింగ్ న్యూస్. అది కూడా ఆయన ఎవరిపైనైతే ఆశలు పెట్టుకున్నారో.. అదే కేంద్ర ప్రభుత్వం, అదే మోడీ ప్రభుత్వం ఆయనకు గట్టి షాకే ఇచ్చిందని అంటున్నారు పరిశీలకులు. మూడు రాజధానులపై తీవ్రస్థాయిలో చంద్రబాబు పోరాడుతున్నారు. కానీ, మూడు మాత్రమే రాష్ట్ర గతిని, భవితను మారుస్తాయని చెబుతున్నారుజగన్. ఇప్పటికే ఈ ప్రతిపాదనపై వచ్చిన అనేక విమర్శలను, వ్యతిరేకతలను కూడా లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తనకున్న అన్ని ఆయుధాలను వినియోగించారు.
కేంద్రమే అడ్డుపడాలని కూడా చెప్పారు. అమరావతికి ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. కాబట్టి, దీనిని ఆయనే కాపాడాలని సెంటిమెంటును కూడా ప్లే చేశారు. ఇక, అమరావతి రైతులు కూడా మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అయితే, ఈ విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసేసింది. దీంతో న్యాయపోరాటానికి దిగారు. ఇది నిన్నటి మాట. కానీ, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం.. బాబుకు గట్టి షాక్ ఇవ్వనుందని అంటున్నారు. విశాఖలో మూడు ప్రధాన జాతీయ రహదారులను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతి ఇస్తూ.. జీవో జారీ చేసింది.
విశాఖను పాలనా రాజధానిగా ప్రతిపాదించిన తర్వాత సీఎం జగన్ స్వయంగా దీనికి సంబంధించిన ప్లాన్‌ను తీసుకుని మోడీని, అమిత్ షాలను కలిశారు. విశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆయన వివరించారు. ఈ క్రమంలోనే మూడు జాతీయ రహదారులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో వాటిని ఆమోదిస్తూ.. రహదారులకు అయ్యే వ్యయంలో 90 శాతం కేంద్రమే భరించేలా తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం సంచలనంగా మారింది. పైగా ఈ ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పిందంటే.. పరోక్షంగా విశాఖను పాలన రాజధానిగా అంగీకరిస్తున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు.
ఇక, అమరావతి విషయానికి వస్తే.. అమరావతిని-అనుపురాన్ని కలుపుతూ ఓ జాతీయ రహదారిని నిర్మించాలని చంద్రబాబు తన ఐదేళ్ల పాలనా కాలంలో కేంద్రంతో పొత్తులో ఉండి కూడా ఫైట్ చేశారు. అయినా.. అది సాకారం కాలేదు. కానీ, ఇప్పుడు జగన్ విశాఖకు ప్రధాన జాతీయ రహదారులను సాధించడం కూడా బాబుకు, జగన్‌కు కేంద్రం ఎలాంటి విలువ ఇస్తోందో చెప్పడానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు. మరి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. తాను అధికారంలో ఉన్నప్పుడే.. ఈ మూడు రహదారులను ప్రతిపాదించానని చెబుతారేమో .. చూడాలి.