బాబు తప్పులు – జగన్ స్కెచ్చుల… ఫలితమే విశాఖ!!

-

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సిఆర్‌డిఎ, పాలానా వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. బీజేపీ కొత్త అద్యక్షుడు సోము వీర్రాజు నియామకం, ఆ తర్వాత అర్థరాత్రి నిమ్మగడ్డ రమేష్‌ నియామక ఉత్తర్వులు జారీ చేయడం, సాయింత్రానికి రాజధాని బిల్లు ఆమోదం పొందడం వంటివి చకచకా జరిగిపోయాయి. పక్కా స్కెచ్ మాత్రం వీటి వెనుక దాగి ఉన్నట్లు తెలుస్తోన్న సత్యం!

ముఖ్యంగా శాసనసభ రెండవసారి ఆ బిల్లు ఆమోదించిన తర్వాత మండలిలో చర్చనే జరగలేదు. దీంతో రాజ్యాంగ రీత్యా గవర్నర్‌ నిర్ణయానికి ఎలాంటి అడ్డంకులూ ఉండాల్సిన అవసరం లేదు! మాజీమంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే అన్నట్టు 200 అధికరణం కింద కేంద్రానికి పంపడమో, లేదా విభజనచట్టంలో ఒక రాజధాని అని వుందని.. మూడు రాజధానులు చెల్లవని చేసే సాంకేతిక వాదనలు గాని నిలిచేవి కావని విశ్లేషకులు మొదటి నుంచీ చేస్తున్న చర్చ! కాగా సున్నితమైన సంక్లిష్టమైన బిల్లులు గనక గవర్నర్..‌ అమరావతి స్థానిక ప్రజల, రైతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌కు గవర్నర్ సూచించి ఉండవచ్చు.

అయితే గత ఏడాది జూన్‌లో కరెక్ట్ గా అమరావతి రాజధానిగా సురక్షితం కాదంటూ సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ మాటలతో రాజధాని రచ్చ మొదలై.. పలు రకాలుగా వికసించి ఇలా గవర్నర్‌ సంతకంతో గొప్పగా ముగిసింది. ఇప్పటి వరకూ కేంద్రం ఆపుతుందని అంగుళం కూడా కదలదని పీఎంవో జోక్యం చేసుకుందని పలు రకాల కథలు చెప్పిన వారు ఇప్పుడు కోర్టులు ఆపుతాయని కొత్త స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

గతంలో హైకోర్టు తరలింపు నిలిపివేయాని చెప్పినప్పటికీ శాసన ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పుడు గవర్నర్‌ కూడా ఆమోదం తెలపడంతో ఆ బిల్లులు స్వభావంపై చర్చ జరిపితే జరపవచ్చుగానీ.. విధాన నిర్ణయంపై కోర్టు ఏమాత్రం తలదూర్చవు! అలాగే ఈ మధ్య తెలంగాణ సెక్రటేరియట్‌ కూల్చివేత సందర్భంలో కూడా సుప్రీం కోర్టు చెప్పింది అదే అన్నది అందరికీ తెలిసిన సత్యమే!

అసలు విశ్లేషకులు భావిస్తున్న దాన్ని బట్టి చూస్తే.. వీటన్నింటికీ… చంద్రబాబు గాలిలో మేడలు కట్టడం, వాస్తవికతకు విరుద్ధంగా 29 గ్రామాలను చిన్నాభిన్నం చేసి మరో కేంద్రీకృత రాజధాని కట్టాలనుకోవడం.. దాని కోసం వేల ఎకరాలు సేకరించి సింగపూర్‌ చేతిలో పెట్టడం జీర్ణించుకోలేని అంశం! అంతటితో ఆగకుండా దేశంలో అయిదవ నగరం, ప్రపంచంలో ప్రముఖ నగరం చేస్తానని ఆయన అమరావతి ప్రజలను మోసం చేయడం వంటి మాటలు ఏమాత్రం ఆచరణ సాధ్యం కానివని విశ్లేషకుల భావన.

ఏది ఏమైనప్పటికీ.. ఎలా చూసుకున్నా.. ఆధునిక భార‌త‌దేశంలో గాని ప్రపంచంలో గాని అలా కొత్తగా పెరిగిన మహానగరాలు చాలా అరుదుగా మనకు దర్శనమిస్తాయి. ఎప్పుడూ తానే సైబరాబాద్‌ కట్టానని చెప్పుకునే చంద్రబాబు అది కూడా హైదరాబాద్‌ ఆధారంతో పెరిగిందన్న విషయాన్ని మర్చిపోయారు! విజయవాడనో గుంటూరునో ఆధారం చేసుకుని పాలనా కేంద్రం కడితే స్టోరీ మరోలా ఉండేదని… ఇప్పుడు జగన్‌ ఆ పని చేస్తే చిన్న నగరం కట్టాడనే ఆరోపణ వస్తుందని తరలింపుకు మరో అవకాశంగా మారింది. అలాగే… చంద్రబాబు ఆశ్రితులకు పెద్దపీట వేసే ఆ ప్రాజెక్టును ఆ ప్రాంతంలో పెట్టుబడిపెట్టి పెంచడం జగన్ ‌కు మింగుడు పడని విషయంగా మారింది.

అదేవిధంగా పారిశ్రామిక ద్రవ్య రాజధానిగా వున్న విశాఖ పట్టనాన్ని మరింతగా అభివృద్ధి చేయడం, పరిపూర్ణ రాజధానికి మలచడం సులభమని జగన్ భావనగా ఉంది! అందుకు తోడు వైసీపీకి తనదైన రాజకీయ ఆర్థిక వ్యూహం కూడా వుంది. విశాఖలో కూడా ఈ ప్రభుత్వం మెగా రాజధాని నిర్మాణం వంటి పనులు పెట్టుకోదని బొత్స స్పష్టంగానే చెప్పారు. భోగాపురం భీమిలి అంటున్నారు గాని ఇప్పుడు కరోనాతో రియల్‌ ఎస్టేట్‌ దెబ్బతినడం వంటివి చూసుకుంటే అమరావతి తరహా భ్రమలు విశాఖలో పునరావృతయ్యే సూచనలు లేవనే చెప్పవచ్చు. మొత్తానికి చూసుకుంటే.. రాజధాని తరలింపుకు జగన్ పక్కా వ్యూహం, చంద్రబాబు చేసిన తప్పులే వైసీపీకి కలిసి వచ్చిన అంశాలుగా చెప్పవచ్చు. అలాగే.. చంద్రబాబు తప్పులకు గుర్తెరిగిన జగన్ పక్కా వ్యూహంతో స్కెచ్ వేసి సక్సెస్ కొట్టడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news