ఆక్రమణలకు దిగమంటున్న బాబు ? ఇదే దిగజారుడు అంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ గందరగోళంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నా, ఏదో రకంగా ఆయన పైచేయి సాధిస్తుండడం, ప్రజలలోనూ, వైసీపీ పాలనపై సంతృప్తి ఉండడం,  జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వంటి వాటితో సంతృప్తి నెలకొంది. అయితే ఏదో రకంగా వైసీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరిగేలా చేయడంతో పాటు, ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని, వచ్చే ఎన్నికల నాటికి బలం పెంచుకోవాలనేది బాబు ప్లాన్. కానీ ఆ ప్లాన్ బాబు ఆశించినంత స్థాయిలో వర్క్ ఔట్ కావడం లేదు. మొన్నటి వరకు అమరావతి అంటూ హడావుడి చేశారు. అమరావతిలో ఎంతో అభివృద్ధి జరిగిపోయిందని, కానీ జగన్ అన్యాయంగా రాజధానిని విశాఖ కు తరలిస్తున్నారు అంటూ, పెద్దగా హడావుడి చేశారు.
ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించినా, వైసిపి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ రాజధాని వ్యవహారంలో బాబు ప్లాన్ వర్కవుట్ కాలేదు. టిడిపి శ్రేణుల్లోనూ అమరావతి వ్యవహారంపై పెద్ద కదలిక లేకపోవడంతో, చంద్రబాబు సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణం లో ఉన్న, పూర్తి చేసుకున్న టిడ్కో ఇళ్ల నిర్మాణం వ్యవహారం తెరపైకి తీసుకు వస్తున్నారు.
అలాగే వైసిపి ప్రభుత్వం లక్షలాది మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు మొత్తం స్థలాలను , ఇళ్ల నిర్మాణాలను సిద్ధం చేసినా, కోర్టు వ్యవహారాలు కారణంగా వాటి పంపిణీని నిలుపుదల చేయడం వంటివి రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయాయి. ఇప్పటికే ఈ ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం బ్యాంకు డిపాజిట్లు చెల్లించిన వారంతా, కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం తప్పేమీ లేదనే విషయం ప్రజలకు బాగా తెలుసు.
కోర్టు వ్యవహారాలు కారణంగానే అది వాయిదా పడుతుంది అన్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఈ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ధ్యేయంతో చంద్రబాబు ఇప్పుడు ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. సంక్రాంతి సమయంలోగా,  స్థలాలను, ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించకపోతే, ప్రజలే వాటిని ఆక్రమించుకోవాలని, వారందరికీ తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందని బాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు ఆరు లక్షల అపార్ట్మెంట్లు కట్టమని చెబుతున్న బాబు, ఆ ప్రభుత్వ హయాంలో ఎందుకు వాటిని లబ్ధిదారులకు అందించలేకపోయారు అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు.
కేవలం రాజకీయంగా విమర్శించేందుకు, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏదో ఒక అంశం కావాలి కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారాన్ని తలకెత్తుకుని ఈ విధంగా ఆక్రమణలకు దిగాలి అని ప్రజలను రెచ్చగొడుతూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అమరావతి వ్యవహారంతో ఆశించినంత స్థాయిలో మైలేజ్ రాకపోవడంతో బాబు ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
-Surya