పోలవరం ఆథారిటీ రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, తక్షణం పునరావాసం పూర్తి చేయాలని డిమాండ్ చేసింది సిపిఎం పార్టీ. “వరదలకు ముందే జులై 31 నాటికి పోలవరం దిగువ కాఫర్ డామ్ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవడంపై పోలవరం అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై వివరణ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. పోలవరం ముంపు పై ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టత లేదు. ఏ కాంటూరు వద్ద ఎంత మునక ఉంటుందో లెక్క సరిగ్గా కట్టనందున జులైలో వచ్చిన వరదల వలన అమాయక గిరిజనులు వందలాది గ్రామాల్లో ఇప్పటికీ అష్ట కష్టాలు పడుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండానే, ప్రాజెక్టు పూర్తయిన తరువాత మునిగే గ్రామాలన్నీ ఇప్పుడే మునిగిపోయాయి. కాంటూరు లెక్కలన్నీ తప్పులతడకగా ఉన్నాయి. ఇంజనీరింగ్ లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా వెల్లడైంది. మరలా ఇప్పుడు వరద ప్రమాదం ముంగిటకొచ్చింది. ఆగస్టు నెలంతా ప్రజలు అరిచేతులో ప్రాణాలు పెట్టుకుని బతకాలి. ఈ దుర్భరస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలి. డ్యాం నిర్మాణంపై వాదోపవాదాలతో కాలయాపన చేయకుండా ముందు 2013 చట్టం ప్రకారం పూర్తిస్థాయి పునరావాసం అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.” అంటూ లేఖలో పేర్కొంది.