వైసీపీ ఎంపీల్లో డీసెంట్ .‌.. ‘ లావు ‘ రాజ‌కీయానికి ఫస్ట్ క్లాస్‌కు మించిన మార్కులే..!

-

ఈ యేడాదిన్న‌ర కాలంలో వైసీపీ ఎంపీల్లో ఒకింత మంచి పేరు సాధించుకుంటున్న నాయ‌కులు ఎవ‌రైనా ఉంటే.. వారిలో ఫ‌స్ట్ పేరు మాత్రం ఖ‌చ్చితంగా గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు పేరు నిలుస్తోంది. ఇటు పార్టీలోను, అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ .. అన్నింటికీ మించి.. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల్లోనూ లావు పేరు మార్మోగుతోంది. “ఆయ‌న డీసెంట్ నాయ‌కుడు“ అని ప్ర‌జ‌లు నేత‌లు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న ఎంపీల‌పై ప్ర‌తిప‌క్ష నాయకులు అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఇసుక‌, భూ, మ‌ద్యం వంటి వాటిలో ఎంపీల దూకుడు ఎక్కువ‌గా ఉంటోంద‌ని, వారి దూకుడుకు సీఎం జ‌గ‌న్ కూడా క‌ళ్లెం వేయ‌లేక‌పోతున్నార‌ని టీడీపీ నాయ‌కులు తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చాలా మంది ఎంపీలకు ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు ఎంపీల‌కు పొస‌గ‌ని ప‌రిస్థితి ఉంది. ఇలాంటి విష‌యాల్లో లావు పేరు ఎక్క‌డా విన‌ప‌డ‌దు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు నేత‌లు చిల్ల‌ర వేషాలు వేస్తూ లావును విమ‌ర్శించ‌డం మిన‌హా ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఎక్క‌డా చెక్కు చెద‌ర్లేదు. వైసీపీ నేత‌ల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎంపీ విష‌యంలో ఎలాంటి విమ‌ర్శ‌లూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అదే స‌మ‌యంలో అన్ని సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతున్నారు. నిజానికి అమ‌రావ‌తి ఉద్యమం విష‌యంలో వైసీపీ ఎంపీలు అభాసుపాల‌య్యారు. స్థానికంగా తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఉండే ఎంపీ నందిగం సురేష్ కూడా వివాదాస్ప‌ద‌మ‌య్యారు. క‌నీసం రాజ‌ధాని గ్రామాల్లో ప‌ర్య‌టించి.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించే ప‌రిస్థితి లేకుండా చేసుకున్నారు. కానీ, లావు మాత్రం నేరుగా అమ‌రావ‌తి ఉద్య‌మంలో ఉన్న రైతుల‌ను క‌లుసుకున్నారు. ప్ర‌భుత్వ వ్యూహాన్ని వివ‌రించ‌డంతోపాటు.. వారి సాధ‌క బాధ‌ల‌ను కూడా విన్నారు. శిబిరాల్లో ప‌ర్య‌టించారు. వారికి న్యాయం జ‌రుగుతుంద‌న్న భ‌రోసా కూడా ఇచ్చారు.

ఇక‌, సొంత పార్టీలో ఎగ‌సి ప‌డుతున్న అస‌మ్మ‌తి విష‌యంలోనూ ఆయ‌న ఎక్క‌డా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. సైలెంట్‌గా ప‌నిచేసుకుని పోతున్నారు. ఒక‌ ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించినా.. కూడా ఆయ‌న ఏమాత్రం సంయ‌మ‌నం కోల్పోకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఎంతో వెన‌క‌ప‌డిన ప్రాంతం అయిన ప‌ల్నాడు నుంచి (న‌ర‌సారావుపేట స‌బ్ డివిజ‌న్ ) ఎంపీగా ఉన్న లావు అక్క‌డ నాలుగైదు ద‌శాబ్దాలుగా ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంతో పాటు జిల్లాకు సంబంధించిన ఎన్నో అంశాల‌ను పార్ల‌మెంటులో లేవ‌నెత్తారు. తాగు, సాగు నీటి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప‌నిచేయ‌డంతో పాటు సీఎం జ‌గ‌న్‌ను ప‌లుమార్లు క‌లిసి ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌త్యేక ప్లానింగ్‌ను డిజైన్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ యేడాదిన్న‌ర కాలంలో లావుకు వైసీపీ ఎంపీల్లో ఫ‌స్ట్ క్లాస్‌కు మించిన మార్కులే ప‌డ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news