రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రులను పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని తెలిపారు. శనివారం మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని చలించిపోయారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.