మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఎట్టకేలకు సీబీఐ కోర్టులో లొంగిపోయారు. జూన్ 2వ తేదీ వరకు ఎర్ర గంగిరెడ్డికి సీబీఐ కోర్టు రిమాండ్ విధించింది. ఆయన్ను కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బయట ఉండటం వల్ల దర్యాప్తులో సహకరించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని సీబీఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అతడి బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ.. మే 5లోపు సీబీఐకి లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఎర్రగంగిరెడ్డి లొంగిపోవడంతో.. ఈ కేసులో ఆరుగురు నిందితులను సీబీఐ జైలుకు పంపినట్లయింది. ఇప్పటికీ ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వివేకా కేసులో ఎర్రగంగిరెడ్డి పాత్ర చాలా కీలకంగా మారింది. వివేకా హత్యకు పథక రచన చేయడంతో పాటు దాన్ని అమలు చేసి, తర్వాత సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలోనూ ఎర్రగంగిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది.