రైతుల అకౌంట్లలో ఈనెల 29వ తేదీన సున్న వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్య మంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, దీన్ని అధికారులు సవాల్ గా తీసుకోవాలన్నారు.
వ్యవసాయశాఖ పై సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలన్నారు. ఈ-క్రాపింగ్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ కొనసాగాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖతో పౌరసరాఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.