ఆ వైసీపీ ఎమ్మెల్యే వివాదాలు కోరుకుంటున్నారా…!

-

బ్యూరోక్రాట్‌ గా ఉండి సడన్ గా రాజకీయాల్లోకొచ్చారు ఆ తర్వాత ఎంపీ కూడా అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పటి స్వేచ్ఛ లేదని భావించారో ఏమో కానీ..కోరి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారి వరప్రసాద్‌. తిరుపతి వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చర్చల్లో ఉండేవారో.. ఇప్పుడు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నా అదే విధంగా ప్రచారంలో ఉంటున్నారు.

వరప్రసాద్‌ వివాదాలు కోరుకుంటున్నారో లేక వివాదాలే ఆయన్ని ముసురుతున్నాయో కానీ గూడూరు ఎప్పుడు చర్చల్లో ఉంటోంది. గత ఏడాది లెదర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రజాభిప్రాయ సేకరణ సభలో మత్స్యకారులు, రైతులు పెద్ద గొడవ చేశారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌కు ఎమ్మెల్యే అనుకూలంగా ఉంటే.. లోకల్‌ వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. ఆ సమస్య అలా ఆగినా లెదర్‌ యూనిట్‌పై ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదని అనుమానిస్తున్నారట.

గూడూరులో వాలంటీర్ల ఎంపికలోనూ ఇలాంటి వివాదమే నడిచింది. ద్వితీయశ్రేణి వైసీపీ నాయకులు ఏకంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఇదే అంశంపై ఆందోళన చేశారు. తమను పట్టించుకోకుండా తన సొంత వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. గూడూరులో ఓ సామాజికవర్గానికి పట్టు ఎక్కువ. వారిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయట. ఎమ్మెల్యేగా కాకుండా వారిపట్ల బ్యూరోక్రాట్‌లా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఈ సమస్యను నోటీస్‌ చేశారో ఏమో కానీ.. తనను నేరుగా కలవాలని కార్యకర్తలకు చెబుతున్నారట ఎమ్మెల్యే వరప్రసాద్‌. ముఖ్యంగా తనను వ్యతిరేకిస్తున్న ద్వితీయశ్రేణి నాయకుల ఆధిపత్యం తగ్గించడానికే ఈ వ్యూహం అనుసరిస్తున్నారని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఆ మధ్య గూడూరులో రాజకీయం చేయాలని చూసిన వరప్రసాద్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన చెన్నై వెళ్లిపోయారు. మళ్లీ వస్తారో రారో తెలియదు కానీ.. పార్టీ శ్రేణుల్లో చర్చల్లో అయితే ఎమ్మెల్యే కుమారుడి పేరు కూడా నలుగుతుందని సమాచారం. ఆ మధ్య మల్లం సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ విషయంలోనూ వరప్రసాద్‌ ప్రత్యర్థివర్గమే పైచేయి సాధించింది. ఇలా గూడూరులోని ఐదు మండలాలు, మున్సిపాలిటీలలో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం చురుకుగా ఉంటోందట.

రెండు వర్గాల పంచాయితీ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి కూడా వెళ్లిందట. అక్కడ ఏమీ తేలక పోవడంతో విషయాన్ని పంచాయితీని అమరావతికి షిఫ్ట్‌ చేశారట మంత్రి. రెండువర్గాలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వల్లే బాలినేని సమక్షంలో సయోధ్య కుదరలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news