మీటర్ల తో ఓటర్లకు గేలం ! హరీషన్న లాజిక్ అదిరింది 

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుపై ధీమా లేకపోవడం, బిజెపి అనూహ్యంగా బలం పుంజుకోవడంతో అధికార పార్టీ టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక్కడ గెలుపు టిఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం కావడం, వచ్చే ఎన్నికలకు ఇది రిఫరెండమ్ కావడం, అలాగే ప్రభుత్వ పనితీరు కు ఇది నిదర్శనం గా మారడంతో ఈ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గెలుపుపై అనుమానం రావడంతో ఇక్కడ ఆ బాధ్యతను పూర్తిగా మంత్రి హరీష్ రావు కు అధిష్టానం అప్పగించింది.
సిద్దిపేట జిల్లా పై పూర్తిగా పట్టున్న హరీష్ రావు  రంగంలోకి దిగి పార్టీకి క్రెడిట్ వచ్చే విధంగా పర్యటనలు చేస్తూ, అనేక హామీలు ఇస్తూ అప్పుడే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా రాయపోలు మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీటర్లు కావాలంటే మీరంతా బిజెపికి ఓటు వేయాలని,  మీటర్లు వద్దు అనుకుంటే కేసీఆర్ సార్ కు, టిఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారుకు ఓటు వేయాలని సూచించారు. టిఆర్ఎస్ పార్టీ నిరంతరం రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తోందని,  కానీ బీజేపీ మాత్రం రైతులకు మేలు చేయకపోగా, వారిపై బాంబులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందంటూ విమర్శించారు.
బావుల వద్ద బోర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేసి కలెక్టర్లతో వసూళ్లు చేస్తామని చెబుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రం వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంగీకారం తెలపగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో మీటర్ల వ్యవహారాన్ని హైలెట్ చేసి బిజెపికి గట్టి షాక్ ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ, రైతుల్లో బీజేపీ పై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ వుండేలా కనిపించడంతో టిఆర్ఎస్ పార్టీ నేతలంతా బిజెపినే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
-Surya