దుబ్బాకలో బీజేపీ ర‌ఘునంద‌న్‌కు అదే ప్ల‌స్ అవుతోందా..!

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప‌ర్వం ఆగేలా లేదు. త్వ‌ర‌లోనే సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు కూడా ఎన్నిక‌లు రానున్నాయి. ఇక దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ రంగంలోకి దిగ‌డం ఖాయ‌మైంది. ఆ పార్టీ కీల‌క నేత ర‌ఘునంద‌న్ రావు ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి విజ‌య‌శాంతితో పాటు మాజీ మంత్రి ముత్యంరెడ్డి త‌న‌యుడు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. క‌త్తి కార్తీక లాంటి వాళ్లు కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ నుంచి మృతిచెందిన రామ‌లింగారెడ్డి త‌న‌యుడు పోటీలో ఉంటారా ?  లేదా మ‌రో నేత పోటీలో ఉంటారా ? అన్న‌ది చూడాలి.

ఈ సారి ఇక్క‌డ ఎంత‌మంది పోటీలో ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు మ‌ధ్య మాత్ర‌మే ఉండ‌నుంది. వాస్త‌వంగా దుబ్బాక 2004 నుంచి టీఆర్ఎస్‌కు కంచుకోట‌గా ఉంటోంది. రామ‌లింగారెడ్డి 2004, 2008 ఉప ఎన్నిక్లో గెలివ‌గా 2009లో ఓడింది. తిరిగి 2014, 2018 ఎన్నిక‌ల్లోనూ రామ‌లింగారెడ్డే విజ‌యం సాధించారు. ఇక్క‌డ టీఆర్ఎస్‌ను గ‌త 15 ఏళ్ల‌లో నాలుగు సార్లు గెలిపించినా దుబ్బాక మాత్రం అభివృద్ధిలో వెన‌క‌ప‌డే ఉంది. దుబ్బాక‌కు ప‌క్క‌నే ఉన్న సిద్దిపేట‌, గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గాలు అభివృద్దిలో దూసుకుపోతుంటే దుబ్బాక మాత్రం చాలా వెన‌క‌ప‌డిపోయింది. ఇవ‌న్నీ స్థానిక ప్ర‌జ‌ల్లో అసంతృప్తికి ఓ కార‌ణంగా ఉంది.

ర‌ఘునంద‌న్‌పై సానుభూతి : ఇక ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్న ర‌ఘునంద‌న్‌రావు గ‌త కొన్నేళ్లుగా ఓడినా, గెలిచినా కూడా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ఉన్నారు. గ‌తంలో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా టీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా ఉన్న ఆయ‌న పార్టీ ప‌టిష్ట‌త కోసం 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఎంతో కృషి చేశారు. ఆ టైంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిన ర‌ఘునంద‌న్ 2014 ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌క‌పోవ‌డంతో బీజేపీలోకి జంప్ చేసి దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న మ‌రోసారి దుబ్బాక‌లోనే పోటీ చేశారు. అనంత‌రం 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మెద‌క్ ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఓడిపోయినా కూడా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాడుతోన్న ర‌ఘునంద‌న్ రావు టీఆర్ఎస్ కంచుకోట‌గా ఉన్న ఉమ్మడి మెద‌క్ జిల్లాలో పార్టీ ప‌టిష్ట‌త కోసం ఎంతో శ్ర‌మిస్తున్నారు. ఇక వ‌రుస ఓట‌ములు వ‌చ్చినా కూడా మెద‌క్ జిల్లాతో పాటు దుబ్బాక‌ను వ‌ద‌ల‌క‌పోవ‌డంతో ఈ సారి ఆయ‌న‌కు సానుభూతి బాగా ప‌నిచేసేలా ఉంది. ఈ సారి ఎలాగైనా దుబ్బాక‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాల‌ని ఆయ‌న తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక‌ను బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం సైతం సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో పాటు ఆర్థిక వ‌న‌రులు కూడా అందించే ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ప్ర‌తి ఉప ఎన్నిక‌లా ఈ సారి దుబ్బాక‌లో మాత్రం కారు జోరు అంత వ‌న్‌సైడ్‌గా ఉండ‌ద‌నే రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

-vuyyuru subhash