స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా ?

ఏపీలో ప్రభుత్వం వర్సెస్‌ ఎస్ఈసీగా నడుస్తున్న పోరు ఒక్కసారిగా వేడెక్కింది.. ఒకరు ఎన్నికల నిర్వహించాలన్నప్పుడు మరొకరు అడ్డుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని ఒకరంటే.. మరొకరు వద్దంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యమేనా..ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏపీలో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య పంచాయతీ పతాక స్థాయికి చేరుకుంది. చర్యలు, ప్రతిచర్యలు, కోర్టు కేసులు, గవర్నర్‌కు ఫిర్యాదులు.. ఇలా ఈ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఎటూ తెగడం లేదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మొండిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. త్వరలో ఎస్ఈసీ పదవీకాలం ముగుస్తుండటంతో.. ఈలోపు ఎన్నికలు నిర్వహించేయాలని ఆరాటపడుతున్నారని.. చంద్రబాబు డైరెక్షన్‌లో ఆయన నడుస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

గతంలో స్టార్‌ హోటల్లో ఎంపీ సుజనా చౌదరి తదితరుల్ని భేటీ కావడం.. ఆ వీడియోలు లీక్‌ కావడంతో పెద్ద దుమారమే రేగింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి.. అలా ప్రైవేట్‌ మీటింగ్స్‌లో పాల్గొనొచ్చా అని విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మాత్రం ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపుతున్నారు. హైకోర్టు ప్రభుత్వ యంత్రాంగంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అధికారుల సమావేశం ముగిసిన వెంటనే షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం రాకపోతే.. మళ్లీ వాదనలు వింటామని కోర్టు ఇంతకముందే స్పష్టంచేసింది. ఇప్పుడు ఈ అంశం మరోసారి కోర్టులకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా SEC నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహార శైలిని అధికార యంత్రాగం తీవ్రంగా తప్పుబడుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రజారోగ్యాన్నే పణంగా పెట్టి అధికార దురహంకారంతో వ్యవహరిస్తున్నారని.. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మాత్రమే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కమిషనర్‌ ఉల్లంఘించారని మండిపడ్డారు. సీఎస్‌ కూడా ఎన్నికల నిర్వహణ కష్టమని వివరించారు. అయినా ఎస్ఈసీ మాత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. సంక్షేమ పథకాల అమలు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎల్లుండి అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు వీటన్నింటిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఎన్నికల కమిషన్‌ ప్రొసీడింగ్స్‌పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సినేషన్‌ సన్నద్ధతలో అధికార యంత్రాంగం ఉన్న తరుణంలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని జగన్ సర్కారు వ్యతిరేకిస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో ప్రత్యేక అధికారుల పాలనను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గత ప్రభుత్వ హాయంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా జడ్పీ, మండలపరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన పూర్తయింది. ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను ఆరు నెలలకు ఒకసారి పొడిగిస్తూ వచ్చింది.

వ్యాక్సినేషన్‌, కరోనా కొత్త స్ట్రెయిన్‌ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం.. ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించింది. ఇప్పుడు ఎస్ఈసీ మాత్రం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేశారు. దీనిపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లే అవకాశంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తోంది. ఎస్ఈసీ నిర్ణయంపై అధికార పార్టీ నేతలు మండిపడుతుండటంతో.. మరోసారి ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.