ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని నేను ముందే చెప్పానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గుర్తు చేశారు. ఇప్పుడు అదే జరిగిందన్నారు. వరుసగా శని, ఆదివారాలు సెలవులు వస్తున్నాయన్న ఆయన, ఐదవ తేదీన మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఈనెల 5వ తేదీన విచారణకు రానుందని పేర్కొన్నారు.
కేంద్ర పెద్దలు జగన్ మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వరని, పార్లమెంటు సమావేశాల అనంతరం ఎన్నికల కోడ్ వచ్చే ముందు జగన్ మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వడం అసలు మంచిది కాదని, కేవలం కంఠశోష మాత్రమేనని ఆయన అన్నారు. రైల్వే జోన్ కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించమని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. రైల్వే జోన్ కోసం స్థలాన్ని ఇస్తే, పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.