ఆంధ్రప్రదేశ్ లో నేటికీ రెండు వర్గాల ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపిలో రెండున్నర సంవత్సరాలు కాపులకు అధికారం ఇస్తామన్నారు. మిగిలిన రెండున్నర్ర సంవత్సరాలు ఓబీసీలకు అధికారం ఇస్తామన్నారు. గతంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా.. చిరంజీవి ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
అప్పట్లో సమీకరణాలు, రాజకీయాలు తెలియక చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు చింతా మొహన్. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతలు, కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు అసంతృప్తిగా ఉన్నారని.. ఈ వర్గాల వారికి స్కాలర్ షిప్ లు అందడం లేదన్నారు.
నిత్యం సీబీఐ కేసులతో ఆంధ్రప్రదేశ్ లో నానా రచ్చ జరుగుతోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ నొక్కిన బటన్ నిధులు ఎటువెళుతున్నాయో తెలియదన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు నిధులు, పథకాలు చేరడం లేదని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో దళితులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.